ఏందిరా ఈ లొల్లి: పిల్లల్లా మారాం చేస్తున్న పాక్.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ

ఏందిరా ఈ లొల్లి: పిల్లల్లా మారాం చేస్తున్న పాక్.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ

వరల్డ్ కప్ 2023 వేదికలపై సస్పెన్స్ వీడడం లేదు. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల వైఖరి కూడా అందుకు ఒక కారణమే. చెన్నై, బెంగుళూరు వేదికలను మార్చాలన్నది పీసీబీ డిమాండ్. అందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు.

వరల్డ్ కప్ వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ, అందుకు సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి పంపింది. దీనికి అనుమతి ఇవ్వడానికి ముందు సభ్య దేశాల నుంచి సూచనలు, సలహాలు కోరడం ఐసీసీ పని. అందుకే ఐసీసీ.. ఏమైనా సలహాలు ఉన్నాయా? అని పీసీబీని కోరగా.. అటువైపు నుంచి రెండు మార్పులు కోరినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో తలపడే చెన్నై వేదిక, ఆస్ట్రేలియాతో తలపడే బెంగళూరు వేదికలను మార్చాలన్నది పీసీబీ డిమాండ్.

స్పిన్ భయం 

చెన్నై వేదికగా పాక్.. అఫ్గానిస్థాన్‌తో తలపడాల్సింది. అయితే చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలించటం.. అఫ్గాన్ జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండటం వారిని భయపెడుతోంది. స్పిన్నర్లకు స్వర్గధామమైన చెన్నై పిచ్‌పై రషీద్‌ ఖాన్‌, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్‌ అహ్మద్‌ స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు కష్టమైన పనే. అందులోనూ రషీద్‌, నూర్‌ అహ్మద్‌‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. ఏమాత్రం తేడా కొట్టిన ఓటమి తప్పదు. అందుకే ఈ వేదికను మార్చాలంటోంది.

హిట్టర్ల భయం

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియా - పాక్ జరగాల్సి ఉంది. దీనికి కూడా పీసీబీ అంగీకరించడం లేదు. బ్యాటింగ్‌కు అనుకూలించే చిన్నస్వామి పిచ్‌పై మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినీస్, మిచెల్ మార్ష్‌లు చెలరేగిపోతారన్న భయం పట్టుకుంది. పాక్‌‌ను ఓడించడానికి బీసీసీఐ కావాలని ఇలాంటి షెడ్యూల్‌ రూపొందించిందన్నది పీసీబీ వాదన. ఈ కారణంగానే పీసీబీ వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆడితే ఆడండి.. లేదంటే లేదు

పీసీబీ డిమాండ్లకు బీసీసీఐ తలొగ్గడం లేదు. జట్టు బలాలు, బలహీనతలను బట్టి వేదికలను మార్చడం జరగదని చెప్తున్నారు. వేదికలను మార్చాలంటే.. అందుకు బలమైన కారణం ఉండాలని బీసీసీఐ ప్రతినిధులు ఓ జాతీయ ఛానల్‌కు వెల్లడించారు. అయితే, 2016 టీ20వరల్డ్ కప్‌ సమయంలోను ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పుడు పాక్‌ కోరినట్లుగానే బీసీసీఐ.. భారత్‌-పాక్‌ ఆడిన మ్యాచ్‌ను భద్రతా కారణాల రీత్యా ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చింది. ఈ సమస్య త్వరగా పరిష్కారమవ్వాలని మనమూ కోరుకుందాం..

ఇక బీసీసీఐ డ్రాఫ్ట్ షెడ్యూల్‌ ప్రకారం.. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.