Team India: గంభీర్ పోటీగా WV రామన్.. టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌ ఎవరు?

Team India: గంభీర్ పోటీగా WV రామన్.. టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌ ఎవరు?

భారత జట్టు తదుపరి హెడ్ కోచ్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రెండ్రోజుల క్రితం వరకు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ఖరారైనట్లు వార్తలొచ్చినప్పటికీ.. అది వాస్తవం కాదని తేలిపోయింది. గంభీర్‌కు పోటీగా మాజీ క్రికెటర్, భారత మహిళా జట్టు మాజీ కోచ్ డబ్ల్యువి రామన్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనేది బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ(CAC) నిర్ణయించనుంది.

టీమ్ ఇండియా హెడ్ కోచ్  మొదటి రౌండ్ ఇంటర్వ్యూలకు గంభీర్ వర్చువల్‌గా హాజరవ్వగా, రామన్ బీసీసీఐ కార్యాలయానికి వెళ్లారు. వీరిద్దరికి క్రికెట్ సలహా కమిటీ (CAC) ఒకే రకమైన ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. స్ప్లిట్ కెప్టెన్సీ, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌, ఫిట్‌నెస్, సీనియర్లపై ప్రశ్నలు అడిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 

ఇద్దరిని అడిగిన 3 ముఖ్యమైన ప్రశ్నలివే

1. జట్టు కోచింగ్ సిబ్బందికి సంబంధించి మీ ఆలోచనలు ఏమిటి?

2. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొంతమంది సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నప్పుడు.. జట్టులో మార్పులు చేయాలంటే ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు?

3. స్ప్లిట్ కెప్టెన్సీ(ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్‌), వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై మీ ఆలోచనలేంటి? ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో జట్టు వైఫల్యం గురించి మీ అభిప్రాయాలు ఏమిటి?

CACని ఆకట్టుకున్న రామన్

రెండో రౌండ్ బుధవారం జరుగుతుంది. గంభీర్ ఫేవరెట్ అని చెప్పబడుతున్నప్పటికీ, రామన్ యొక్క ప్రజెంటేషన్ CACని బాగా ఆకట్టుకున్నట్లు సమాచారం. ఆటగాళ్లతో ఓర్పు, సహనంగా ఉంటూనే ఆశించిన ఫలితాలను ఎలా రాబట్టచ్చనేదానిపై రామన్ మంచి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఆసక్తిచూపని ద్రవిడ్

ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. కొత్త కోచ్ కోసం గడిచిన నెలలో దరఖాస్తులు ఆహ్వానించింది. తదుపరి జట్టుతో కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేరు. మొదట ఈ పదవి కోసం రికీ పాంటింగ్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, మహేళ జయవర్దనే, జస్టిన్‌ లాంగర్‌ లాంటి పరువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్‌వైపు మొగ్గు చూపినట్లు వార్తలొచ్చాయి.