ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరువాత అత్యంత విజయవంతమైన జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు చెందిన ఈ ప్రాంచైజీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. గౌతం గంభీర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు 2012, 2014 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. అలాంటి జట్టు గత రెండు సీజన్లలో చెప్పుకోదగ్గ ఆటతీరు కనబరచలేదు. ఒకరిద్దరు మినహా మిగిలిన ఆటగాళ్ళందరూ విఫలమయ్యారు. కోట్లు కుమ్మరిచినా ఫలితం లభించలేదు.
2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 అపజయాలతో 7వ స్థానంలో నిలిచిన కేకేఆర్.. 2023 సీజన్‌లోనూ అదే సీన్ రిపీట్ చేసి 7వ స్థానానికే పరిమితమైంది. ఆ జట్టులో యువ బ్యాటర్ రింకు సింగ్ మినహా నిలకడగా ఆడిన ఆటగాడు మరొకరు లేరు. అందుకే ఈ ఫలితాలొచ్చాయి. కానీ, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీకి కేకేఆర్ యాజమాన్యం కొనుగోలు చేసిన విదేశీ ఆటగాళ్లను చూస్తుంటే.. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
కేకేఆర్ స్టార్ ఆటగాళ్ళైన ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, జాసన్ రాయ్‌లతో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. వీరితో పాటు ఆస్ట్రేలియా మిస్టరీ స్పిన్నర్ ఆడమ్ జంపా, న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్, దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రోసౌవ్‌లను కూడా సొంతం చేసుకుంది. వీరికి భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్, అమెరికా ఆటగాళ్లు జస్కరన్ మల్హోత్రా, అలీ ఖాన్ జతకట్టనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాడు.. మల్హోత్రా. ఇలా విదేశీ ఆటగాళ్లతో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ స్క్వాడ్
ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, జాసన్ రాయ్, ఆడమ్ జంపా, మార్టిన్ గప్టిల్, రిలీ రోసౌవ్, అలీ ఖాన్, ఉన్ముక్త్ చంద్, జస్కరన్ మల్హోత్రా, నితీష్ కుమార్, కార్న్ డ్రై, అలీ షేక్, సైఫ్ బాదర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, భాస్కర్ యాడ్రం.