రెండ్రోజుల క్రితం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పట్టుబడిన నలుగురిని శ్రీలంక జాతీయులుగా గుర్తించిన ఏటీఎస్ అధికారులు.. వారు మొదట కొలంబో నుంచి చెన్నైకి.. అనంతరం అహ్మదాబాద్ చేరినట్లు తెలియజేశారు. వీరి వద్ద నుంచి మూడు పాకిస్థానీ తయారీ పిస్టల్స్, 20 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఉగ్రవాద కదలికల నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
బుధవారం(మే 22) అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్ల మధ్య కీలక ఎలిమినేటర్ పోరు జరుగనుంది. ఈ సమరానికి ముందు రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్లు ఎలాంటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు. ఉగ్రవాద కదలికల నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ మంగళవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కానీ ఎటువంటి కారణం చూపకుండానే రద్దు చేయబడినట్లు కథనాలు వస్తున్నాయి.
విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత అరెస్టుల గురించి తెలుసుకున్నాడు. అతను జాతీయ సంపద, అతని భద్రతే మా అత్యంత ప్రాధాన్యత.. అని పోలీసు అధికారి విజయ్ సింఘా తెలిపారు. బెంగళూరు యాజమాన్యం రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ప్రాక్టీస్ సెషన్ ఉండదని వారు మాకు తెలియజేశారు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి కూడా ఈ విషయం తెలియజేశాం. అయితే వారి ప్రాక్టీస్ ముందుకు సాగడంలో వారికి ఎలాంటి సమస్యలు లేవు అని వెల్లడించారు.
భద్రత కట్టుదిట్టం
కాగా, ఇరు జట్ల ఆటగాళ్లు బసచేస్తున్న హోటల్ బయట భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఎంట్రీ సృష్టించారు. ఎవరినీ లోపలకి అనుమతించడం లేదు. మీడియా సిబ్బందిని కూడా హోటల్‌లోకి రాకుండా నిషేధించారు. మరోవైపు, 'గ్రీన్ కారిడార్' ఉపయోగించి ఆర్ఆర్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు వారికి భారీ భద్రతను కల్పించారు.