డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్: టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్!

డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్: టీమిండియా కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్!

టీమిండియా తదుపరి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ భాద్యతలు చేపట్టనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓటమి నేపథ్యంలో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా జోరందుకుంది. ఈ క్రమంలోనే అయ్యర్ పేరు తెరపైకి వస్తోంది.

పేలవ ఆటతీరు, వయస్సు మళ్లడం వంటివి కూడా రోహిత్‌ను తప్పించేందుకు కారణాలవుతున్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు.. 36. ఈ వయస్సులో అతడు మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా కొనసాగడం కష్టం. అతడు ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగాలనుకుంటే టెస్ట్ ఫార్మాట్‌కు స్వస్తి పలకాల్సిందే. అలా చేస్తే ఎక్కువ కాలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగవచ్చు. అందుకే అతన్ని తప్పించి.. ఆ  బాధ్యతలు అయ్యర్‌కు అప్పగించే దిశగా ప్రయత్నాలుజరగతున్నాయట. అందులోనూ తదుపరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ నాటికి కొత్త సారథిని నియమించాలని బీసీసీఐ యోచిస్తోందట. 

నిలకడగా ఆడటంతో అయ్యర్ దిట్ట

శ్రేయాస్ అయ్యర్‌కు మంచి బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కి అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు అయ్యర్ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడు. అయితే వరుసగా గాయాల బారిన పడటం అతడి క్రికెట్ కెరీర్‌ని ప్రశ్నార్థకం చేస్తోంది. 

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడ్డ అయ్యర్.. ఐపీఎల్ 2023లో కూడా భాగం కాలేకపోయాడు. గాయం నుంచి అతడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతడు వెస్టిండీస్ సిరీస్ నాటికి అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని పేరు తెరపైకి వస్తోంది.