కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై 3 వారాల్లో నివేదిక ఇవ్వండి:హైకోర్టు

కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై 3 వారాల్లో నివేదిక ఇవ్వండి:హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌  వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం థర్మల్‌  పవర్‌  స్టేషన్‌  నుంచి బూడిద, ఇతర కాలుష్యం కర్కవాగు, కిన్నెరసాని నదుల్లో కలుస్తున్నా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలుచేస్తూ కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన దాసరి రమేశ్  కుమార్‌,  మరొకరు పిల్‌  దాఖలు చేశారు. 

ఇందులో 2022లో పీసీబీ అధికారులు నివేదిక సమర్పిస్తూ థర్మల్‌ స్టేషన్‌కు చెందిన అవక్షేపాల నిల్వకు ప్రత్యేకంగా ట్యాంకు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయడం లేదని, ట్యాంకులోకి పంపకుండా నేరుగా కర్కవాగులోకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  అలోక్‌  అరాధే, జస్టిస్‌  జె.అనిల్‌ కుమార్‌లతో కూడిన బెంచ్ ఇటీవల మరోసారి విచారణ చేపట్టింది. 2022లో సమర్పించిన నివేదికకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఎలాంటి అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంతో పీసీబీ అధికారులు మరోసారి థర్మల్‌ స్టేషన్‌ను సందర్శించాలని బెంచ్  ఆదేశించింది. థర్మల్‌ స్టేషన్‌  కాలుష్యంపై తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.