భారత టెస్టు జట్టులో వెటరన్ ప్లేయర్స్ పుజారా, రహానే కనిపించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.మొత్తం 30 మందికి నాలుగు రకాల కేటగిరీలలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కేటాయించింది. ఈ లిస్టులో సీనియర్ ఆటగాళ్లు పుజారా, అజింక్య రహానెలను బోర్డు పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరి కెరీర్ దాదాపుగా ముగిసినట్టుగానే కనిపిస్తుంది. పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీలో చెలరేగుతున్న సెలక్టర్లు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదు. మరోవైపు రహానే ఇదే టోర్నీలో దారుణంగా విఫలమవుతున్నాడు.
దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ వెటరన్ బ్యాటర్లను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా లాంటి పిచ్ లపై అనుభవాన్ని పక్కన పెట్టేయడంతో సెలక్షన్ విధానంపై కొంతమంది విమర్శలు గుప్పించారు. అయితే సెలక్టర్లు కుర్రాళ్లవైపే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలో సర్ఫరాజ్, పటిదార్, జురెల్ లాంటివారు టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేయగా.. పుజారా, రహానే స్థానాల్లో గిల్, రాహుల్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్న వీరు ఇకపై నుంచి టీంఇండియాలో కనిపించడం కష్టంగానే కనిపిస్తుంది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించి ద్రావిడ్, లక్ష్మణ్ వారసులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం వీరికి గడ్డు కాలం నడుస్తుంది. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు.
రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.