ఉగ్రవాదుల దాడి.. 8 మంది పాక్ సైనికులు మృతి

పాకిస్థాన్‌: ఇస్లామాబాద్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్నూ మిలటరీ కంటోన్మెంట్‌పై సోమవారం (జూలై 15) తెల్లవారుజామున ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కనీసం ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) మంగళవారం(జులై 16) ప్రకటించింది. ఈ ఘటనలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులను హతమయ్యారని మిలిటరీ వర్గాలు తెలిపాయి. 

ALSO READ | జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు..నలుగురు జవాన్లు మృతి

సోమవారం(జులై 15) తెల్లవారుజామున అత్యాధునిక ఆయుధాలు, ఆత్మాహుతి చొక్కాలు ధరించిన ఉగ్రవాదులు బన్నూ కంటోన్మెంట్‌పై దాడి చేశారు. లోనికి ప్రవేశించడం కుదరకపోవడంతో పేలుడు పదార్ధాలతో కూడిన వాహనంతో కంటోన్మెంట్‌ గోడలకు ఢీకొట్టారు. అదే సమయంలో చెక్‌పాయింట్ వద్ద మరో వాహనాన్ని పేల్చివేశారు. దీనివల్ల భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం లోపలకి చొచ్చుకెళ్లిన ఉగ్రమూకలు.. సైనికులపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది సైనికులు, మరో ఎనిమిది మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వస్తున్నాయి. అయితే, మృతుల సంఖ్య ఎంతనేది స్పష్టత లేదు. దాడి జరిగిన ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం భారీగా మోహరించింది. ఈ దాడిలో ఆఫ్ఘనిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హఫీజ్‌ గుల్‌ బహదూర్‌ గ్రూప్‌ ప్రమేయం ఉందని సైన్యం ఆరోపించింది.