అక్టోబర్ 23.. చెన్నై చెపాక్ స్టేడియం, పాకిస్తాన్ vs ఆఫ్గనిస్తాన్ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 282 పరుగుల భారీ స్కోర్.. స్టేడియం అంతటా నిశ్శబ్దం.. షాహీన్ అఫ్రిది, హరీష్ రౌఫ్, హసన్ అలీల కూడిన పాక్ త్రయాన్ని ఆఫ్ఘన్ బ్యాటర్లు ఎదుర్కోగలరా! అని అందరిమదిలో ఒకటే ప్రశ్న. కొద్దిసేపటి తరువాత తిరిగి ఆట ప్రారంభమయ్యింది.. ఓవర్లు గడుస్తున్న కొద్దీ ఆఫ్ఘన్ డగౌట్‌లో చిరునవ్వులు.. పాక్ డగౌట్‌లో నిరాశ. చివరకు మరో మూడు గంటలు గడిచేసరికి అఫ్ఘనిస్తాన్ విజయం.
ఆఫ్ఘన్ల సంబరాలు
పాకిస్థాన్‌పై విజయం సాధించగానే అఫ్గాన్ క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. చెపాక్ మైదానమంతా కలియ తిరుగతూ తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అక్కడ కామెంటరీ చేస్తోన్న ఇర్ఫాన్ పఠాన్ వారితో కలిసి స్టెప్పులు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగా టోర్నీ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న పఠాన్ అలా చేయడాన్ని కొందరు విమర్శించగా, మరికొందరు ఇది క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించే చర్య అని కొనియాడారు.
Rasid khan fulfilled his promise and I fulfilled mine. Well done guys @ICC @rashidkhan_19 pic.twitter.com/DKPU0jWBz9
— Irfan Pathan (@IrfanPathan) October 23, 2023
ఇర్ఫాన్ పఠాన్ తో సంభాషించను
చివరకు ఈ చర్యలు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఆఫ్ఘన్ విజయంపై పఠాన్ సంబరాలు చేసుకుపోవడం నచ్చక పాక్ కెప్టెన్ అతని ఇంటర్వ్యూని తిరస్కరించినట్లు కథనాలు వస్తున్నాయి. బాబర్ ఆజం ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవడానికి స్టార్ స్పోర్ట్స్ ప్రయత్నించగా అతడు తిరస్కరించాడని సమాచారం. తన మాతృభూమి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే వారితో సంభాషించడంతనకు ఇష్టం లేదని బాబర్ ఆజం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమాత్రం పౌరుషం ఉండాలే! అని పాక్ కెప్టెన్ ను మరింత రెచ్చగొడుతున్నారు.