భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనంగా ఉన్న విషయం అందరికీ విదితమే. ఈ కారణంగానే పాకిస్తాన్‌తో సిరీస్ అన్నా.. పాక్ పర్యటన అన్నా బీసీసీఐ అభ్యంతరం చెప్తోంది. అయితే, నివేదికల ప్రకారం.. త్వరలోనే బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో పాటు బీసీసీఐ అధికారులు పాకిస్తాన్ వెళ్లనున్నట్లు సమాచారం.
పీసీబీ ఆహ్వానం
ఈనెల 30 నుంచి ఆసియా కప్ 2023 పోరు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో నేపాల్ vs పాకిస్తాన్ తలపడనుండగా.. సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్‌లో భారత్ vs పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్‌కు హాజరవ్వాల్సిందిగా.. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) ఆహ్వానాలు పంపింది. అందులో భాగంగానే బీసీసీఐ పెద్దలు పాకిస్తాన్ వెళ్లనున్నారని సమాచారం.
ఈ కాంటినెంటల్ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మరొకొందరు బీసీసీఐ పెద్దలు పాకిస్తాన్ రానున్నారని పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.
2023 ఆసియా కప్‌లో పాకిస్తాన్ 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఫైనల్‌తో సహా తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఇండియా ఆడబోయే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి. బీసీసీఐ పెద్దల పాక్ పర్యటన.. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
ఆసియా కప్ 2023 షెడ్యూల్
- ఆగస్టు 30: పాకిస్థాన్ vs నేపాల్ (ముల్తాన్)
- ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక (క్యాండీ)
- సెప్టెంబర్ 2: ఇండియా vs పాకిస్తాన్ (క్యాండీ)
- సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
- సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్ (క్యాండీ)
- సెప్టెంబర్ 5: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
సూపర్ 4:
- సెప్టెంబర్ 6: A1 vs B2 (లాహోర్)
- సెప్టెంబర్ 9: B1 vs B2 (కొలంబో)
- సెప్టెంబర్ 10: A1 vs A2 (కొలంబో)
- సెప్టెంబర్ 12: A2 vs B1 (కొలంబో)
- సెప్టెంబర్ 14: A1 vs B1 (కొలంబో)
- సెప్టెంబర్ 15: A2 vs B2 (కొలంబో)
- సెప్టెంబర్ 17: ఫైనల్ (కొలంబో)