ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏపీకి ఒక జట్టు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ఓ ఫ్రాంచైజీ జట్టు ఉంటే.. రాష్ట్రంలోని ఆటగాళ్లకు మంచి అవకాశాలు వస్తాయన్నది ఏపీ ముఖ్యమంత్రి ఆలోచన. కానీ, అది ఆచరణకు నోచుకుంటుందా! అనేది అనుమానంగా మారింది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఏర్పాటై నేటికి(ఆగష్టు )70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 70వ వార్షికోత్సవానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ దిగ్గజం మదన్‌లాల్ ఆదివారం విశాఖపట్నానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ.. తన రంజీ ట్రోఫీ రోజులను ముఖ్యంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేడియంలో ఆంధ్ర జట్టుతో ఆట ఆడినప్పటి జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రోత్సాహంతో ఏపీ క్రికెటర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని అన్నారు.
కొత్త ఫ్రాంచైజీకి అవకాశం లేదు
ఈ సంధర్బంగా బిన్నీ.. ఐపీఎల్ గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లీగ్‌కు వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులారిటీ ఉందన్న బీసీసీఐ బాస్.. ఐపీఎల్ ప్రమాణాలను పాటించాలంటే అందులో పాల్గొనే ఫ్రాంచైజీల సంఖ్య మీద నియంత్రణ ఉండాలన్నారు. అందువల్ల ఇప్పట్లో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రా అభిమానుల నిరాశ
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీకి ఇప్పట్లో అవకాశం లేదని బిన్నీ చెప్పడం.. ఆంధ్రా క్రికెట్ అభిమానులను నిరాశ పరిచింది. ఈ వ్యాఖ్యలు అటు అభిమానులతో పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిరుత్సాహంలో పడేశాయి.
కాగా, 2022 సీజన్ 8 జట్లుగా ఉండగా.. కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల రాకతో ఆ సంఖ్య 10కి చేరింది.