భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కే) స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా ఇంట విషాదం నెలకొంది. రైనా మేనమామ కొడుకు సౌరభ్ కుమార్ (తల్లి బంధువు) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో రైనా సోదరుడు, మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం(మే 01) రాత్రి 11:30 గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో గల గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యారు. ఈ ప్రమాదంలో అతనితో పాటు వెంట ఉన్న అతని స్నేహితుడు శుభమ్(19) కూడా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి సౌరభ్, శుభమ్ తుదిశ్వాస విడిచారు. సౌరభ్ తండ్రి మాగో రామ్ ఫ్యాక్టరీలో ఉద్యోగి.
హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు హైవేపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను షేర్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు.. మండీలో అరెస్ట్ చేశారు. నిందితుడిపై మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 187తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్) మరియు 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక రైనా విషయానికొస్తే, 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బ్రాడ్‌కాస్టర్‌గా పనిచేస్తున్నాడు.