ఆసియా కప్ 2023 టోర్నీపై ఉత్కంఠ.. 28న డిసైడ్

ఆసియా కప్ 2023 టోర్నీపై ఉత్కంఠ.. 28న డిసైడ్

ఆసియా కప్‌ 2023 టోర్నీ నిర్వహణపై మే 28న స్పష్టత రానుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచును వీక్షించేందుకు స్వదేశానికి రానున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు, అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుల అధ్యక్షులు ఈ విషయంపై చర్చించనున్నారు. హైబ్రిడ్‌ మోడల్ లో ఆసియా కప్‌ నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను కూడా ఆ మీటింగ్‌లో పరిశీలించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. 

భద్రతా కారణాల రీత్యా భారత జట్టు.. పాక్ లో పర్యటించడం కుదరదని చెప్పిన బీసీసీఐ, తటస్థ వేదికలను పరిశీలించాలని కోరిన సంగతి తెలిసిందే. మొదట అందుకు అంగీకరించని పాక్, ప్రత్యామ్నాయం లేకపోవడంతో హైబ్రిడ్‌ మోడల్ ప్రతిపాదనకు తలూపింది. దీని ప్రకారం.. భారత్ ఆడబోయే మ్యాచులన్నింటినీ యూఏఈ వేదికగా, మిగిలిన మ్యాచులను పాక్ లో నిర్వహించనున్నారు. అయితే, సెప్టెంబ‌లో యూఏఈ వాతావరణం అనుకూలంగా ఉండదని బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ బోర్డులు అభ్యంతరం తెలపడంతో టోర్నీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.  

కాగా, గతేడాది టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఈ టోర్నీని ఈఏడాది వన్డే వరల్డ్‌కప్‌ 2023 దృశ్యా వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఇక ఆసియా కప్‌ను అత్యధికంగా టీమిండియా ఏడుసార్లు గెలుచుకోగా.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్‌ రెండు సార్లు ఛాంపియన్‌గా అవతరించాయి. గతేడాది ఈ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలవగా, పాక్ రన్నరప్ గా నిలిచింది. టైటిల్ ఫేవరైట్ గ బరిలోకి దిగిన భారత జట్టు సూపర్-4కు కూడా అర్హత సాధించకుండానే ఇంటిదారి పట్టింది.