England Cricket: ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా కుమార సంగార్కర!

England Cricket: ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా కుమార సంగార్కర!

ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్, రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగార్కర బాధ్యతలు చేపట్టనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఐపీఎల్ కారణంగా జోస్ బట్లర్‌తో అతనికున్న బలమైన సంబంధాల కారణంగా సంగక్కర పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే అతని పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. 

పేలవ ప్రదర్శన.. 7వ స్థానం 

గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. జట్టునిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ, అందరూ సమిష్టిగా విఫలమయ్యారు. తొమ్మిదింటిలో కేవలం మూడింట విజయం సాధించారు. అందునా, ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి వారిని బాగా దెబ్బతీసింది. ఈ వైఫల్యాల నేపథ్యంలో ఇంగ్లండ్ బోర్డు ప్రక్షాళన మొదలు పెట్టింది. కెప్టెన్‌గా బట్లర్‌ను కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నా.. హెచ్ కోచ్ మాథ్యూ పాట్స్‌ను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే అతని స్థానంలో కొత్త కోచ్‌ను ప్రకటించనుంది. 

రేసులో జోనాథన్‌ ట్రాట్‌

ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్ రేసులో సంగార్కర పాటు పలువురు మాజీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లు ఆండ్రూ ఫ్లింటాఫ్‌, జోనాథన్‌ ట్రాట్‌, ఆసీస్ దిగ్గజం మైకేల్ హస్సీ రేసులో ఉన్నారు. ఫ్లింటాఫ్ ఇటీవలే నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఇన్ హండ్రెడ్‌తో తన తొలి కోచింగ్ పాత్రను పొందగా.., ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ట్రాట్ ఘనత వహించాడు. 

సెప్టెంబరులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్‌ జరగనుంది. అంతకుముందే ECB కొత్త ప్రధాన కోచ్‌ని ప్రకటించవచ్చని సమాచారం.