ఇక దబిడిదిబిడే.. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఖరారు!

ఇక దబిడిదిబిడే.. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ పేరు ఖరారు!

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల(జూన్) చివరి వారంలో బీసీసీఐ పెద్దలు.. గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఏ చిన్న తప్పును ఉపేక్షించని గంభీర్ చేతుల్లోకి భారత జట్టు అంటే, ఆటగాళ్లు సహా అభిమానులూ భయపడిపోతున్నారు. విఫలమైతే ఆటగాళ్లపై ఎలాంటి చర్యలుంటాయా తెలిపేలా నెట్టింట మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.   

ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగియనుంది. తదుపరి జట్టుతో కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతో.. కొత్త కోచ్ కోసం బీసీసీఐ గడిచిన నెలలో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పదవి కోసం రికీ పాంటింగ్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, మహేళ జయవర్దనే, జస్టిన్‌ లాంగర్‌ లాంటి పరువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అందునా, ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన నాటి నుంచి గంభీర్ పేరు బాగా వినిపిస్తోంది. అతను భారత జట్టును విజయపథంలో నడిపించగలరని మాజీలు చెప్పుకొచ్చారు. అయితే, హెడ్ కోచ్ పదవి కోసం అతను దరఖాస్తు చేసుకున్నారా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు.  

జింబాబ్వే టూర్ నుంచే విధులు

ఒకవేళ గంభీర్ భారత జట్టు బాధ్యతలు చేపడితే, ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా అతనికిదే మొదటి బాధ్యత. గంభీర్‌ గతంలో ఏ జట్టుకు ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా పని చేయలేదు. 2022, 2023లో లక్నోకు.. 2024లో కేకేఆర్‌కు మెంటార్‌గా మాత్రమే పని చేశారు. 2024 టీ20 ప్రపంచకప్‌ అనంతరం భారత జట్టు.. జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఒకవేళ గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు చేపడితే, జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు మొదలువుతాయి.