Champions Trophy 2025: సభ్యదేశాల ఆమోదం.. పాకిస్థాన్ చేతికి రూ.586 కోట్లు!

వచ్చే ఏడాది దాయాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించి ముఖ్యమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య ఖర్చుల కొరకు ఐసీసీ.. పాకిస్థాన్‌కు 65 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.586 కోట్లు) అందించనున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం కొలంబోలో జరిగిన వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ఈ భారీ బడ్జెట్‌ను ఐసీసీ సభ్యదేశాలు ఆమోదించినట్లు నివేదికలు వస్తున్నాయి. అదే నిజమైతే, ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న పీసీబీకి ఇది పండగలాంటి వార్త. 

పాకిస్థాన్ వెలుపల టీమిండియా మ్యాచ్ లు

భారత్ మినహా మిగిలిన అన్ని దేశాలు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు అభ్యంతరం తెలపలేదు. దాంతో, టోర్నీ దాయాది దేశంలోనే జరగనుంది. అయితే, భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఆ దేశంలో భారత్ ఆడే అవకాశాలు వంద శాతం లేవు. ప్రభుత్వం అనుమతిస్తే, పంపుతామని బీసీసీఐ చెప్తున్నా,  అలాంటి సంకేతాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. ఒకవేళ అదే జరిగితే, ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ ప్రయత్నాలు జరుపుతోంది. టీమిండియా ఆడే మ్యాచ్‌లు శ్రీలంక లేదా యూఏఈలో జరగవచ్చు. అటువంటి పరిస్థితిలో ఖర్చులు పెరుగుతాయి. 

ఈ కారణంగా పాకిస్థాన్‌కు ఐసీసీ అదనపు బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం. టీమిండియా మరేదైనా వేదికపై ఆడితే, దానికి 4.5 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ షెడ్యూల్ 

  • ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (కరాచీ)
  • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs భారత్ (లాహోర్)
  • ఫిబ్రవరి 21: అఫ్గానిస్థాన్‌ vs దక్షిణాఫ్రికా (కరాచీ)
  • ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 23: న్యూజిలాండ్ vs భారత్ (లాహోర్)
  • ఫిబ్రవరి 24: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ (రావల్పిండి)
  • ఫిబ్రవరి 25: అఫ్గానిస్థాన్‌ vs ఇంగ్లాండ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (రావల్పిండి)
  • ఫిబ్రవరి 27: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ (లాహోర్)
  • ఫిబ్రవరి 28: అఫ్గానిస్థాన్‌ vs ఆస్ట్రేలియా (రావల్పిండి)
  • మార్చి 1: పాకిస్థాన్ vs భారత్ (లాహోర్)
  • మార్చి 2: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ (రావల్పిండి)
  • మార్చి 5: సెమీ-ఫైనల్ (కరాచీ)
  • మార్చి 6: సెమీ-ఫైనల్(రావల్పిండి)
  • మార్చి 9: ఫైనల్‌ (లాహోర్)