Women’s T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. తరలిపోనున్న టీ20 ప్రపంచకప్‌!

Women’s T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. తరలిపోనున్న టీ20 ప్రపంచకప్‌!

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత హింసాత్మ‌కంగా మారాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటివరకూ 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏకంగా దేశ ప్రధాని షేక్‌ హసీనా పదవి నుంచి వైదొలిగి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయింది. అయినప్పటికీ, నిరసనకారులు శాంతించడం లేదు. ప్రభుత్వ భవనాలు, అవామీ లీగ్ పార్టీ నేతలకు చెందిన ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇదే అదునుగా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారు. ఈ పరిస్థితులలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక ప్రకటన చేసింది. 

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ పరిస్థితలు సద్దుమణగకపోతే, వచ్చే నెలలో బంగ్లాదేశ్‌ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తామని తెలిపింది. నివేదికల ప్రకారం, భారత్ లేదా శ్రీలంకకు ఈ టోర్నీని తరలించనున్నట్లు సమాచారం. అయితే, అక్టోబర్‌లో శ్రీలంకలో వర్షం ముప్పు ఎక్కువ. ఈ నేపథ్యంలో భారత్‌ వైపే ఐసీసీ మొగ్గు చూపొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.

Also Read :- సచిన్ రికార్డులపై కోహ్లీ కన్ను

"బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు BCB, వారి భద్రతా ఏజెన్సీలు.. మా స్వతంత్ర భద్రతా సలహాదారులతో సమన్వయం జరుపుతున్నాయి. అక్కడి పరిస్థితులను ఐసీసీ  ఎల్లవేళలా నిశితంగా పరిశీలిస్తోంది. టోర్నమెంట్ ఆరంభానికి ఇంకా ఏడు వారాలు మిగిలి ఉన్నాయి. అప్పుడే టోర్నీ మార్పు గురించి నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుంది. అయితే, టోర్నీలో పాల్గొనే వారందరి భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత.." అని ఐసిసి అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 

10 జట్లు.. 18 రోజులు

పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ 1 ఉండగా..  ఆతిథ్య బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌ 2 గ్రూప్‌-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్‌-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 20న ఫైనల్‌ జరగనుంది.