క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వరల్డ్‌కప్‌ టికెట్ల అమ్మకం ఎప్పటినుంచంటే?

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వరల్డ్‌కప్‌ టికెట్ల అమ్మకం ఎప్పటినుంచంటే?

ఈ ఏడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు భారత గడ్డపై వన్డే ప్రపంచ కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ.. తేదీలలో కొన్ని మార్పులు ఉండనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లు ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. 

ఆగస్టు 10 నుంచి టిక్కెట్లు

టికెట్ల ధరలు, మైదానాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా రాష్ట్రాల క్రికెట్‌ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో టికెట్ల ధరలు, టికెట్ల అమ్మకాలు, మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు వంటి అనేక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జూలై 31లోపు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు టికెట్ ధరలను ఖరారు చేసి బీసీసీఐకి తెలియజేయనున్నాయి. ఇదంతా మరో నాలుగు రోజుల్లో పూర్తికానుండగా.. ఆగస్టు 10 నుంచి టిక్కెట్లు విక్రయాలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 

ఫిజికల్‌ టికెట్లు తప్పనిసరి

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగులో చేసినా.. మ్యాచ్ కు హాజరయ్యే సమయంలో ఫిజికల్‌ టికెట్లు తప్పనిసరి అని జై షా స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ-టికెట్లను అనుమతించబోమని పేర్కొన్నారు. అభిమానులు ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి 7 నుంచి 8 కేంద్రాలను సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. 

ఐసీసీ, బీసీసీఐలకు ఎన్ని టిక్కెట్లంటే?

ప్రోటోకాల్‌ ప్రకారం.. ఐసీసీ, బీసీసీఐలు ఒక్కో మ్యాచ్ కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్లను అందుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లు ఐసీసీకి 1295 లీగ్ మ్యాచ్ టిక్కెట్లతో పాటు.. టీమిండియాకు సంబంధించిన 1355 టికెట్లను.. వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను కూడా అందించనున్నాయి. వీటికి అదనంగా మరో 500 జనరల్ టిక్కెట్లను రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్స్‌ బీసీసీఐకి ఉచితంగా అందించనున్నాయట.

కాగా ఇండియా - పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 15న కాకుండా 14న నిర్వహించే అవకాశాలున్నాయి. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడమే అందుకు కారణం. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది.