ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని కాసులు పంట పండించుకున్నారు. ఆ జట్టు ఓపెనర్ కుశాల్ భుర్టెల్ 2లక్షల 75వేలు గెలుచుకోగా.. మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (2 లక్షలు), సోంపాల్ కమీ (2 లక్షల 25వేలు), గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ 75వేల లక్షలు చొప్పున సొంతం చేసుకున్నారు.
బీర్ కంపెనీ ఆఫర్..
బలమైన భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. నేపాల్ జట్టు ఆటగాళ్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కూ రూ. లక్ష రూపాయలు, బ్యాటర్ బాదిన ఒక్కో సిక్సర్‌కు రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది. అలాగే ఫోర్ బాదితే రూ.25 వేలు చెల్లిస్తామని తెలిపింది. ఈ ప్రకటనే నేపాల్ ఆటగాళ్లకు కనుక వర్షం కురిపించింది. కొందరు లక్షలు గెలుచుకోగా.. మరికొందరు వేలతో సరిపెట్టుకున్నారు. నేపాలీష్ రూపాయలలో ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.
ఎవరెవరు ఎంత గెలుచుకున్నారంటే.. ?
- కుశాల్ భుర్టెల్ (3 ఫోర్లు, 2 సిక్సులు) - 2లక్షల 75వేలు
- ఆసిఫ్ షేక్ (8 ఫోర్లు) - 2 లక్షలు
- సోంపాల్ కమీ (ఒక ఫోర్, 2 సిక్సులు) - 2 లక్షల 25వేలు
- గుల్సన్ ఝా (3 ఫోర్లు) - 75వేలు
- దీపేంద్ర సింగ్ ఐరీ (3 ఫోర్లు) - 75వేలు
వర్షం అంతరాయం
ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో అంపైర్లు నిలిపి వేశారు. మ్యాచ్ తిరిగి ఆట ప్రారంభమైతే, మరికొందరు ఆటగాళ్లు డబ్బు గెలుచుకునే అవకాశముంది. కాగా, ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేయగా.. భారత ఇన్నింగ్స్ మొదలైన 2.1 ఓవర్లలోనే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఆట తిరిగి ప్రారంభమైనా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అంపైర్లు ఓవర్లను కుదించనున్నారు.