Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా భారత్ - పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..?

Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా భారత్ - పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..?

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ పోరుకు సంబంధించి కీలక అప్‌డేట్ అందుతోంది. మార్చి 1న లాహోర్‌(పాకిస్థాన్ గడ్డపై) వేదికగా ఈ ఇరు జట్లు తలపడనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ కీలక పోరుకు బీసీసీఐ అంగీకారం తెలపడమే మిగిలివుందని సమాచారం. 

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ.. ఐసీసీకి సమర్పించినట్లు పీటీఐ నివేదించింది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీకి లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లాహోర్‌లో ఏడు, కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రారంభ మ్యాచ్ సహా రెండు సెమీఫైనల్స్‌ కరాచీలో జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్‌కు రావల్పిండి ఆతిథ్యమివ్వనుంది.

మార్చి 1న..

ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం, మార్చి 1న లాహోర్‌ వేదికగా భారత్ - పాక్ తలపడనున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన, రవాణా కారణాల వల్ల టీమిండియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లన్నిటిని లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు పరిమితం చేసినట్లు పీటీఐ నివేదికలో వెల్లడైంది. అయితే, ఈ టోర్నీకి భారత జట్టును పంపే విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాల కారణంగా ఈ ఇరు జట్లు కేవలం ఐసీసీ, ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. పాక్ జట్టు భారత్ లో పర్యటిస్తున్నప్పటికీ.. భారత జట్టు దాయాది దేశానికి వెళ్లడం లేదు. ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తేనే భారత క్రికెట్ జట్టు.. పాక్ పర్యటనకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఖరాఖండీగా చెప్తున్నాయి. 

కాగా, భారత పురుషుల జట్టు చివరిసారి 2008, జూలైలో పాకిస్థాన్‌లో పర్యటించింది.