క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చే ఏడాది విదేశాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం.. 2024 సార్వత్రిక ఎన్నికలు. వచ్చే ఏడాది మే-జూన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు ఆటంకం కలగనుంది. దీంతో బీసీసీఐ.. రెండో అర్ధ భాగాన్ని విదేశాల్లో నిర్వహించే ప్లాన్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు టీ20 ప్రపంచకప్
ఐపీఎల్ 2024 టోర్నీకి ఓవైపు ఎన్నికలు ఆటంకం కలిగిస్తుంటే.. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 అడ్డంకిగా మారుతోంది. మే-జూన్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. నివేదికల ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ లెక్కన మే మొదటి వారంలోపే ఐపీఎల్‌ను పూర్తి చేయాలి. లేదంటే సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో గతంలో మాదిరి వచ్చే ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
2009లో దక్షిణాఫ్రికా
ఐపీఎల్ టోర్నీని గతంలోనూ విదేశాల్లో నిర్వహించారు. 2009 ఎన్నికల సందర్భంగా దక్షిణాఫ్రికాలో నిర్వహించగా.. 2014 ఎన్నికల సమయంలో మ్యాచ్‌లను భారత్‌లో, మరికొన్ని మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించారు. అందువల్ల ఐపీఎల్ 2024ను విదేశాలకు తరలించాల్సి వస్తే యూఏఈ లేదా దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించడం ఖాయమని తెలుస్తోంది.