Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా అమిత్ షా తనయుడు!

Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌గా అమిత్ షా తనయుడు!

అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఛైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టనున్నట్లు నివేదికలు  వస్తున్నాయి. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఐసీసీ పీఠాన్ని అధిరోహించిన బార్క్లే.. మూడోసారి అందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. దాంతో, తదుపరి ఐసిసి ఛైర్మన్‌ జై షా అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే జై షా పోటీ చేస్తారా? లేదా అన్న దానిపై స్పష్టత లేదు.

ఆగష్టు 27 చివరిరోజు

ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 27 మంగళవారం చివరి తేదీగా నిర్ణయించారు. ఆలోపు షా నామినేషన్ దాఖలు చేస్తే చైర్మన్ రేసులో ఉన్నట్లు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తే, 1 డిసెంబర్ 2024న ఎన్నికలు నిర్వహించనున్నారు.

తొమ్మిది ఓట్లొస్తే.. చైర్మన్

ఐసీసీ నిబంధనల ప్రకారం, చైర్మన్ ఎన్నికలో 16 ఓట్లు ఉంటాయి. వీటిలో తొమ్మిది ఓట్లు పోలైన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికైతే, బీసీసీఐ కార్యదర్శి లీడింగ్‌లో ఉన్నట్లు సమాచారం. షాకు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పూర్తికాల సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించినట్లు తెలుస్తోంది.

ఐదవ భారతీయుడు

జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైతే ఐదవ భారతీయుడు కానున్నారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీకి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.