Team India: భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్!

Team India: భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్!

భారత పురుషుల జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే అతని పేరు ఖరారయ్యిందని, బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలివుందని జాతీయ మీడియా పేర్కొంది.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌తో భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనుంది. అది ముగిసిన వెంటనే అతని స్థానంలో మాజీ ఓపెనర్ గంభీర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆ సమయంలో బీసీసీఐ.. ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పేరు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. 

పులి జింకను వేటాడుతున్నట్లు..

సహచరులు సహా ఇతర ఆటగాళ్లు మైదానంలో ఫీల్డింగ్‌కు మాత్రమే పరిమితమైతే.. రోడ్స్ మైదానంలో విన్యాసాలు చేయగలడు. పులి జింకను వేటాడుతున్నట్లు.. అతని కదలికలు ఉంటాయి. అంత వేగంగా, ఖచ్చితత్వంతో స్పందిస్తాడు. 1992 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్-ఉల్-హక్‌ను అతను రనౌట్ చేసిన విధానం క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఒక మరుపురాని జ్ఞాపకంగా ఉంది. 54 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ పలు అంతర్జాతీయ, ఫ్రాంచైజీ జట్లకు కోచ్‌గా పనిచేశారు.

రోడ్స్.. 2009లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో ఫీల్డింగ్ కోచ్‌గా చేరారు. తొమ్మిదేళ్లపాటు ఆ జట్టుతో కలిసి పనిచేశారు. అనంతరం 2022 సీజన్‌కు ముందు  ఫీల్డింగ్ కోచ్‌గా లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరారు. ఇప్పుడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికై, ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌తో పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

2019లో ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు

2019లో రోడ్స్ భారత ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతనికి అవకాశం రాలేదు. ఈ విషయం గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఒకానొక సమయంలో వెల్లడించారు. "అవును, నేను భారత కొత్త ఫీల్డింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాను. నేను, నా భార్య ఈ దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము. ఇప్పటికే ఈ దేశం మాకు చాలా ఇచ్చింది. మా ఇద్దరు పిల్లలు భారతదేశంలో జన్మించారు.." అని రోడ్స్ అన్నారు. 

కాగా, ప్రస్తుతం పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా ఉండగా.. టి దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు.