IPL 2025: వేలంలోకి కేఎల్ రాహుల్‌.. రూ.20 కోట్లైనా తగ్గేది లేదంటున్న RCB!

ప్రస్తుత భారత జట్టులో అత్యంత నిలకడగా రాణించగల ఆటగాడు ఎవరు..? అంటే అందరూ చెప్పే పేరు కేఎల్ రాహుల్. వికెట్ కీపర్/ బ్యాటర్ అయిన రాహుల్ ప్రతి మ్యాచ్‌లోనూ రాణించగల సమర్థుడు. కాకపోతే, స్ట్రైక్ రేట్ తక్కువుగా ఉండటం అతనిపై విమర్శలకు దారి తీస్తుంటాయి. గత రెండేళ్లుగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఈ ఏడాది వేలంలోకి రానున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ఓనర్‌తో తిట్లు

గడిచిన ఐపీఎల్ సీజన్ లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో రాహుల్‌ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఆరంజ్ ఆర్మీ ఎదుట 166 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ టార్గెట్‌ను హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్(89*), అభిషేక్ శర్మ(75*) కేవలం 9.4 ఓవర్లలోనే చేధించారు. ఈ మ్యాచ్ అనంతరం లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్‌ గోయంకా.. రాహుల్‌‌ని అనరాని మాటలు అన్నారు. అందరూ చూస్తుండగానే బౌండరీ లైన్ వద్దే అతనిపై నోరు పారేసుకున్నారు. ఆ ఘటన జరిగిన మరుక్షణం లక్నో నుండి వైదొలగాలని రాహుల్ నిర్ణయించుకున్నాడని అప్పట్లో కథనాలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ రాహుల్ వేలంలోకి రానున్నాడని సమాచారం.   

ఈ నెల చివరి నాటికి ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్టును ప్రకటించాల్సి ఉంది. ఆ గడువు దగ్గర పడుతుండటంతో ఈ విషయం బయటకు పొక్కింది.

ఆ రెండు ఫ్రాంచైజీల మధ్య పోటీ

ఇటు బ్యాటర్‌గా, అటు కెప్టెన్‌గా సేవలందించగల రాహుల్ కోసం ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్(MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య తీవ్ర పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సఫారీ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆర్సీబీ వదిలించుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కెప్టెన్‌తో పాటు నిలకడైన బ్యాటర్ ఎంతో అవసరం. దాంతో రాహుల్ కోసం ఆర్సీబీ యాజమాన్యం రూ.20 కోట్లు వెచ్చించడానికైనా సిద్ధంగా ఉందని సమాచారం. మరోవైపు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనుండటంతో ఓపెనర్ సేవల కోసం నీత అంబానీ ఫ్రాంచైజీ రాహుల్ కోసం పోటీ పడనుందని తెలుస్తోంది.

2022 సీజన్‌లో రాహుల్‌ రూ. 17 కోట్ల రికార్డు ధర  పలికాడు. ఐపీఎల్‍లో ఇప్పటివరకూ ఈ బ్యాటర్ 132 మ్యాచ్‌ల్లో 134.61 స్ట్రైక్ రేట్‌తో 4,683 పరుగులు చేశాడు.

Also Read:-భారత్- బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్