భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోతున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కుమారుడి పాలన, నటషాకు చెల్లించాల్సిన భరణంపై ఇప్పటికే ఈ జంట ఓ ఒప్పందం చేసుకున్నట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. ఈ విడాకుల పుకార్ల నడుమ భారత క్రికెటర్ భార్య.. తన ఇన్‌స్టాలో అగ్నికి ఆజ్యం పోసింది. 'దూరంగా వెళ్లిపోతున్నా..' అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టింది. దాంతో, వీరి దాంపత్య జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది.
నటాషా షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీలో సూట్‌కేస్ చిత్రాన్ని చూడవచ్చు. దీనికి ''ఆ సమయం వచ్చేసింది'' అన్న క్యాప్షన్ జోడించింది. క్యాప్షన్‌తో పాటు విమానం, ఇంటి ఎమోజీలను షేర్ చేసింది. దీనిని బట్టి హార్దిక్ సతీమణి తన స్వదేశం సెర్బియాకు తిరిగి వెళ్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరి, ఈ ప్రయాణం కొన్నాళ్లేనే..!తిరిగొస్తాడా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు.
విడాకులు నిజమేనా..!
టీ20 ప్రపంచకప్ విజయానంతరం స్వదేశానికి చేరుకున్న హార్దిక్ కు అభిమానులు బ్రహ్మరథం పట్టగా.. నటాషా ఎక్కడా కనిపించలేదు. కనీసం అతన్ని అభినందిస్తూ పోస్ట్ కూడా పెట్టకపోవడం విడాకులు నిజమనేలా తావిస్తోంది. అందునా, స్టాంకోవిక్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో జనాలకు ఏం తెలియదు.. తొందరగా అపార్ధం చేసుకుంటారు అంటూ విరుచుకు పడింది.
"ఒక వ్యక్తిపై ఏదైనా రూమర్స్ వస్తే జనాలు వారిపై సానుభూతి చూపించకుండా త్వరగా తీర్పు చెప్పేస్తారు. మనం ఊహించలేని పని చేస్తే ప్రజలు మనల్ని అపార్థం చేసుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో బాధగా అనిపిస్తుంది. ప్రజలకు ఎలాంటి సానుభూతి ఉండదు. ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోకుండా నేరుగా తీర్పు చెప్పేస్తారు.." అని హార్దిక్ భార్య వీడియోలో పేర్కొంది.
కాగా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, మోడల్ అయిన నటాషాను పాండ్యా మే 31, 2020న వివాహం చేసుకున్నారు. ఈ జంట ఫిబ్రవరి 2023లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలతో రెండవసారి కూడా వివాహం చేసుకున్నారు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. ఈ బంధం నిలబడకపోవడం కొసమెరుపు.