T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించనున్న పాకిస్థాన్!

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించనున్న పాకిస్థాన్!

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ (2025) జరగనున్న విషయం తెలిసిందే. 1996 తర్వాత దాదాపు 29 ఏళ్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. 8 జట్లు తలపడబోయే ఈ టోర్నీలో భారత్ మినహా అన్ని జట్లు పాకిస్థాన్‌లో దిగడం ఖాయం. ఇప్పటికే ఆయా బోర్డులు తాము పాల్గొనే విషయాన్ని పీసీబీకి చేరవేశాయి.

ఉగ్రవాద, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు.. దాయాది దేశానికి వెళ్లడం అసంభవమే. మెన్ ఇన్ బ్లూ పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా..! లేదా..! అనే దానిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, టీమిండియా పాక్‌లో ఆడదు కనుక, ప్రత్యామ్నాయంగా భారత్ ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని కోరినట్లు నివేదికలు వచ్చాయి. అయితే, అందుకు పీసీబీ అంగీకరించడం లేదని సమాచారం. 

మూడు రోజుల్లో స్పష్టత..!

జూలై 19 నుండి జూలై 22 వరకు శ్రీలంకలో ఐసీసీ సమావేశం కానుంది. ఈ భేటీలో బీసీసీఐ.. పాకిస్తాన్‌లో ఆడటంపై తమ వైఖరి ఏంటనేది స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆసియా కప్ (2023)నిర్వహించినట్లుగానే హైబ్రిడ్ పద్ధతిలో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయాలని ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, 2026 టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ బహిష్కరించననుందని ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

భారత్, శ్రీలంక 

2026లో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా పొట్టి ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. ఒకవేళ, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు.. పాకిస్తాన్‌లో పర్యటించకపోతే 2026 టీ20 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ బహిష్కరించనుందని సమాచారం. ఇప్పటికే క్రికెట్ అపెక్స్ బాడీ ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు, 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్‌ను బహిష్కరించనుందట. దీనిపై దాయాది దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.