మన దేశంలో ప్రాణాలు ఎదురొడ్డి దేశాన్ని కాపాడే సైనికులకు అభిమానులు ఉన్నారో.. లేదో కానీ, క్రికెటర్లకు, సినీ సెలెబ్రెటీలకు మాత్రం బోలెడు మంది ఉన్నారు. వీరిది అభిమానమో.. లేదా మరొకటో ఒక్కోసారి అంతుపట్టదు. ఇప్పటివరకూ హీరోలకు.. పెద్ద కటౌట్లు పెట్టి, పాలాభిషేకాలు, పూలమాలలతో అలంకారాలు, లేదా విగ్రహాలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం వంటి దృశ్యాలు ఎన్నో చూశాం..
ఇక అన్నదానాలు, రక్తదానాల సంగతి సరేసరి. అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కొతీరు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల తీరు ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఆయనను అమితంగా ఆరాధించే ఇద్దరు అభిమానులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పరిచయం ఎలా జరిగిందో తెలియదు కానీ పరస్పర అంగీకారంతో ఈ జంట ఏడడుగులు వేశారు. పెళ్లి అనంతరం పూలదండల స్థానంలో జనసేన పార్టీ కండువాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో..? ఎంత వరకు నిజమో తెలియదు! కానీ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2023
పెళ్లి అనతరం కండువాలు మార్చుకున్న నూతన వధూవరులు pic.twitter.com/qv1TV4k2So
నూతన వధూవరులు.. పార్టీ కండువాలు మార్చుకుంటున్నప్పుడు అభిమానుల కేరింతలు హోరెత్తుతున్నాయి. అభిమానులు.. ఈ వధూవరులిద్దరినీ సోషల్ మీడియా సెలెబ్రెటీలను చేసేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి.. ఆయన అభిమానులు పలువురు ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం.