Indian cricketers: భారత క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగింది..?

Indian cricketers: భారత క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు.. అసలేం జరిగింది..?

దివ్యాంగులను అవహేళన చేయడం, వారి మనోభావాలను కించపరిచేలా వ్యవహరించారనే ఆరోపణలపై భారత మాజీ త్రయం హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా పోలీసులకు ఫిర్యాదు అందింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఈ ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత జట్టు విజేతగా అవతరించింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్.. పాకిస్థాన్‌ను ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ విజయం అనంతరం భారత మాజీలు హర్భజన్, యువరాజ్, రైనా వికలాంగులలా నటిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. 15 రోజుల పాటు ఈ టోర్నీలో ఆడటం వల్ల తమ శరీరాలు సహకరించడం లేదనే అర్థం వచ్చేలా వీడియోలో అనుకరించారు. దీనిని కొందరు విమర్శకులు వక్రీకరించారు. వికలాంగులను అవహేళన చేశారంటూ కొత్త వివాదాన్ని సృష్టించారు.

ఈ వీడియోపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో వెంటనే సదరు వీడియోను తొలగించిన హర్భజన్.. దివ్యాంగులను కించపరచాలనేది తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చాడు. తమ చేష్టలు ఎవరినైనా బాధించే ఉంటే మన్నించాలని క్షమాణపలు కూడా కోరాడు. అయినప్పటికీ, ఈ వివాదం సద్దుమణగ లేదు. 

దేశంలోని 10 కోట్ల మంది వికలాంగులను అవమానపరించారంటూ ప్రపంచకప్ విజేతలపై NCPEDP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇన్‌స్టాగ్రామ్ (మెటా యాజమాన్యం)పై న్యూఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.