IND vs SL: ఆకాశం మేఘావృతం.. భారత్ -శ్రీలంక తొలి వన్డే జరిగేనా?

IND vs SL: ఆకాశం మేఘావృతం.. భారత్ -శ్రీలంక తొలి వన్డే జరిగేనా?

శ్రీలంకపై టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. రేపటి నుంచి ఆతిథ్య జట్టుతో వన్డేల్లో తలపడనుంది. ఈ ఇరు జట్ల మధ్య శుక్రవారం(ఆగష్టు 2) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. ఆతిథ్య లంక టీమ్‌కు కుశాల్ మెండిస్ నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఎలా ఆడతారో చూస్తానంటూ వరుణుడు కాసుకు కూర్చున్నాడు.

ఆకాశం మేఘావృతం

గతేడాది భారత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో కనిపించిన భారత ద్వయం రోహిత్, విరాట్.. చాలా రోజుల తరువాత వన్డేల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు ఈ జోడీపైనే ఉన్నాయి. ఎలా ఆడతారో..! ఏంటోనన్న సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే, ఈ తొలి సమరానికి తాను అడ్డుపడతానంటూ వరుణుడు అక్కడే తిష్ట వేశాడు. Accuweather ప్రకారం, శుక్రవారం కొలంబోలోని స్టేడియం పరిసరాల్లో వర్షం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 28 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని పేర్కొంది. 

పిచ్ రిపోర్ట్

ప్రేమదాస స్టేడియంలోని పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ వర్షం పడి తేమ అనుకూలించే మంచి స్వింగ్ చూడవచ్చు. ఆట జరుగుతున్న పిచ్ పాతది కావడంతో పరుగులు నెమ్మదిస్తాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారత్- శ్రీలంక మధ్య జరిగే తొలి వన్డేను భారత అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, Sony LIV యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.


భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

శ్రీలంక తుది జట్టు(అంచనా): పతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దునిత్ వెలగలే, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్.