IND vs SA: సఫారీ సిరీస్‌కు ముందు భారత జట్టుకు కష్టాలు.. ఇద్దరు పేసర్లు దూరం!

వన్డే ప్రపంచకప్‌, స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం భారత జట్టు.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో ఇద్దరు మినహా మిగిలిన వారందరూ ఇప్పటికే సఫారీ గడ్డపై అడుగుపెట్టారు. ఈ సిరీస్ డిసెంబర్ 10 నుంచి షురూ కానుండగా, ప్రారంభానికి ముందే భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. 

పేసర్లకు స్వర్గధామం సఫారీ పిచ్‌లు

దక్షిణాఫ్రికా పర్యటన అనగానే అందరికీ గుర్తొచ్చేది.. పేసీ పిచ్‌లు. అలాంటి పిచ్‌లపై భారత జట్టు ఇద్దరు పేసర్ల సేవలను కోల్పోనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దీపక్‌ చాహర్‌, టెస్టుల్లో మహ్మద్‌ షమీలు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లేది అనుమానంగా మారింది. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన షమీ.. ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. వరల్డ్‌ కప్‌ సమయంలోనే అది ఇబ్బందిపెట్టినా షమీ అలానే నెట్టుకొచ్చాడు. కానీ దక్షిణాఫ్రికా సిరీస్‌కు మాత్రం అతను వెళ్లేది అనుమానమేనని వార్తలు వస్తున్నాయి.

చాహర్‌ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్

మరో పేసర్ దీపక్‌ చాహర్‌ వెళ్ళేది కూడా అనుమానమే. చాహర్‌ తండ్రి లోకేంద్ర సింగ్‌ రెండ్రోజుల బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. ఇలాంటి పరిస్థితులలో తండ్రిని వదిలి అతను వెళ్ళేది కష్టమే. ప్రస్తుతం చాహర్‌ తండ్రి బాగోగులు చూసుకునేందుకు ఇక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని అతడు బీసీసీఐకి తెలిపినట్టు మీడియాకు వెల్లడించాడు. తనకు తండ్రి ఆరోగ్యమే ముఖ్యమని, ఆయన పరిస్థితి కుదుటపడ్డాక దక్షిణాఫ్రికా పర్యటన గురుంచి ఆలోచిస్తానని తేల్చి చెప్పాడు. ఇలా ఇద్దరు పేసర్లు సఫారీ సిరీస్ కు దూరం కానున్నారు.

భారత జట్టు సౌతాఫ్రికా పర్యటన(డిసెంబర్‌ 10 - 2024 జనవరి 07)

  • ఫస్ట్ టీ20 (డిసెంబర్ 10): డర్బన్
  • రెండో టీ20 (డిసెంబర్ 12): గబెర్హా
  • మూడో టీ20 (డిసెంబర్ 14): జోహన్నెస్‌బర్గ్
  • ఫస్ట్ వన్డే (డిసెంబర్ 17): జోహన్నెస్‌బర్గ్
  • రెండో వన్డే (డిసెంబర్ 19): గబెర్హా
  • మూడో వన్డే (డిసెంబర్ 21): పార్ల్
  • మొదటి టెస్ట్ (డిసెంబర్‌ 26 - డిసెంబర్‌ 30): సెంచూరియన్
  • రెండో టెస్ట్ (జనవరి 3 - జనవరి 7) : కేప్ టౌన్