T20 World Cup 2024: మీరు అక్కర్లేదు.. వెళ్లండి: టోర్నీ మధ్యలోనే స్వదేశానికి భారత క్రికెటర్లు

T20 World Cup 2024:  మీరు అక్కర్లేదు.. వెళ్లండి: టోర్నీ మధ్యలోనే స్వదేశానికి భారత క్రికెటర్లు

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ సేన అద‌ర‌గొడుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‍ల్లో అన్నింటా గెలిచి సూపర్-8కు అర్హత సాధించింది. లీగ్ ద‌శ‌లో త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో కెన‌డాతో తలపడనుంది. ఫ్లోరిడా వేదిక‌గా శ‌నివారం(జూన్ 15) ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజ‌యం సాధిస్తే  టీమిండియా టేబుల్ టాప‌ర్‌గా గ్రూప్ ద‌శ‌ను ముగిస్తుంది. అనంతరం సూపర్-8 సమరం కోసం వెస్టిండీస్‌కు ప‌య‌నం కానుంది.

కరేబియన్ గడ్డపై తదుపరి సమరం

పొట్టి ప్రపంచకప్‌ పోరుకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. సూప‌ర్ 8 మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, ఫైన‌ల్ మ్యాచులు కరేబియన్ గడ్డపైన జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త మేనేజ్‌మెంట్ కీల‌క నిర్ణయం తీసుకున్నట్లుగా కథనాలు వ‌స్తున్నాయి. సూపర్-8 మ్యాచ్‌లకు ముందు శుభ్‌మ‌న్ గిల్‌, అవేశ్ ఖాన్‌లు స్వదేశానికి పంపనుందని తెలుస్తోంది.

టీ20 ప్రపంచ‌క‌ప్‌ పోరుకు రింకూ సింగ్‌, ఖ‌లీల్ అహ్మద్‌తో పాటు శుభ్‌మ‌న్ గిల్‌, అవేశ్ ఖాన్‌లు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. 15 మంది స‌భ్యులు గ‌ల భారత బృందంలో ఎవరైనా గాయ‌ప‌డితే వారి స్థానంలో వీరిని భర్తీ చేస్తారు. ప్రస్తుతం రోహిత్ బృందంలో అలాంటి సమస్యలేవీ లేవు. అందునా, రోహిత్, విరాట్ జోడి ఓపెన‌ర్లుగా వ‌స్తుండ‌డంతో రెగ్యుల‌ర్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌కే తుది జట్టులో స్థానంలో దక్కడం లేదు. దీంతో మ‌రో ఓపెన‌రైన గిల్ సేవ‌లు ఈ ప్రపంచ‌క‌ప్‌లో అవ‌స‌రం లేద‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింద‌ట‌. 

మరోవైపు, వెస్టిండీస్‌ స్లో పిచ్‌లపై పేస‌ర్ అవేశ్ ఖాన్ సేవలు అక్కర్లేదు. ఉన్నవారిలో బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌, సిరాజ్‌ల‌లో ఒక‌రికే తుది జట్టులో స్థానం దక్కొచ్చు. హార్దిక్ పాండ్యా ఎలాగూ మూడో పేస‌ర్‌గా బాధ్యత‌లు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిలో ఒక‌రు గాయ‌ప‌డినా అవేశ్ అవ‌స‌రం ఉంద‌ని మేనేజ్‌మెంట్ బావించింద‌ట‌. ఈ నేపథ్యంలో  గిల్‌, అవేశ్ ఖాన్‌ల‌ను స్వదేశానికి పంపంచ‌నుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. మిగిలిన ఇద్దరు రింకూ సింగ్‌, ఖ‌లీల్ అహ్మద్ ట్రావెలింగ్ రిజ‌ర్వ్‌లుగా జట్టుతో ప్రయాణించనున్నారు.