Champions Trophy 2025: పాకిస్తాన్‌లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్‌లు!

Champions Trophy 2025: పాకిస్తాన్‌లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్‌లు!

వచ్చే ఏడాది(2025లో) పాకిస్తాన్‌ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు.. పాక్ వెళ్లేందుకు అంగీకరించినట్లు ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ రహస్యంగా ఉంచాలని పీసీబీని కోరినట్లు, అధికారుల సమన్వయ లోపం వల్ల సమాచారం బహిర్గతమైనట్లు తెలుస్తోంది.  

ఐసీసీ మధ్యవర్తిత్వం

1996 వన్డే ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్‌లో జరగనున్న తొలి ఐసీసీ ఈవెంట్ ఇదే. 2008 ముంబై ఉగ్రదాడుల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో మెన్ ఇన్ బ్లూ.. పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం పూర్తిగా మానేసింది. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతోంది. గతేడాది(2023) పాక్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అభ్యంతరం తెలపడంతో.. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహించారు. టీమిండియా మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికి.. పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఐసీసీ మధ్యవర్తిత్వం వహించి.. భారత జట్టును పాక్‌లో పర్యటించేందుకు ఒప్పించిందని సారాంశం.

మూడు వేదికలు 

వాస్తవానికి పీసీబీ.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి మూడు వేదికలను ఖరారు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటికే అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. అయితే, భారత జట్టు భద్రతపై పలు అనుమానాల నేపథ్యంలో  టీమిండియా మ్యాచ్‌లన్నీ ఒకే వేదికకు పరిమితం చేసినట్లుతెలుస్తోంది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు. నిజంగా మన జట్టు.. ఆ దేశానికి వెళుతుందా అంటే అనుమానించాల్సిందే.