భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ).. దాయాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటివరకూ ద్వైపాక్షిక సిరీస్‌లకు నో చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు పాక్ గడ్డపై జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ ఆడేందుకు ససేమిరా అంటోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే, బీసీసీఐ మాత్రం పాక్ లో పర్యటించేది లేదని తెగేసి చెప్తోంది. సరిహద్దు సమస్యలు ఓ కొలిక్కి వచ్చేవరకూ దాయాది దేశానికి వెళ్లేది లేదని ఖరాకండిగా చెప్తోంది. దీంతో దాయాది క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భారత జట్టు లేకపోతే టోర్నీ కళ తప్పడమే కాకుండా, లాభాలలో భారీగా గండి పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు ద్రుష్టి పెట్టింది.
ఆసియా కప్ బాటలోనే ఛాంపియన్స్ ట్రోఫీ
మూణ్ణెల్ల క్రితం జరిగిన ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. అచ్చం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అలానే జరుగనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని సమాచారం. మొత్తం టోర్నీని తరలించడం కంటే భారత్ మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్‌లో నిర్వహిస్తే సరిపోతుందని పీసీబీ భావిస్తోందట.
తాజాగా, పీసీబీ చీఫ్ జకా అష్రఫ్.. ఐసీసీ జనరల్ కౌన్సిల్ జొనాథన్ హాల్‌తో పాటు యూనైటైడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అలీ జరూనీతో దుబాయ్‌లో సమావేశమయ్యారు. ఈ ముగ్గురి సమావేశం ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ మ్యాచ్‌ల గురించే అని పాకిస్తాన్ మీడియా కోడైకూస్తోంది. మరి దుబాయ్ వేదికగా ఆడేందుకు బీసీసీఐ అందుకు అంగీకరిస్తుందా! అనేది తేలాల్సి ఉంది. దీనిపై పీసీబీ, ఐసీసీలు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకటన చేస్తాయో వేచి చూడాలి.
As per reports, Champions Trophy 2025 is likely to be played in hybrid model in UAE ?#ChampionsTrophy2025 #BCCI #UAE #ICC #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/Ox0Na3KPEI
— InsideSport (@InsideSportIND) December 25, 2023