భద్రత ఇవ్వలేం.. పాకిస్తాన్ మ్యాచ్‌లు మరో చోట పెట్టుకోండి!: హైదరాబాద్ పోలీసులు

భద్రత ఇవ్వలేం.. పాకిస్తాన్ మ్యాచ్‌లు మరో చోట పెట్టుకోండి!: హైదరాబాద్ పోలీసులు

వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభమవడానికి మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ.. మ్యాచ్‌ల షెడ్యూల్‌పై సందిగ్దత వీడటం లేదు. ఇప్పటికే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని మ్యాచ్ ల తేదీలలో మార్పులు చేసిన ఐసీసీ.. రీషెడ్యుల్ తేదీలను కూడా ప్రకటించింది. తాజాగా, మరో బిగ్ అప్‌డేట్ అందుతోంది. 

సెప్టెంబర్ 29న రాజీవ్ గాంధీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న వార్మప్ మ్యాచ్‌ను పునఃపరిశీలించాలని కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సిఏ) బీసీసీఐకి ఈ-మెయిల్ పంపినట్లు వార్తలొస్తున్నాయి. ఆ మ్యాచ్ పాకిస్తాన్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. 

గణేష్ నిమజ్జనం,  మిలన్-ఉన్-నబీ

నివేదికల ప్రకారం.. సెప్టెంబరు 28న నగరంలో గణేష్ విసర్జన్ మరియు మిలన్-ఉన్-నబీ పండుగల ఊరేగింపులు జరగనున్నాయి. ఆ మరుసటి రోజే పాకిస్తాన్ మ్యాచ్ ఉండటం కారణంగా భద్రతా సంస్థలు తగిన భద్రతను అందించలేమని హెచ్‌సీఏకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని వివరిస్తూ హెచ్‌సీఏ.. బీసీసీఐకి ఈ -మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. రీషెడ్యూల్ చేయటం వీలు కానియెడల వార్మప్ మ్యాచ్‌ను నగరం నుండి మరొక చోటికి తరలించాలని కోరినట్లు సమాచారం.

మరో మ్యాచ్ కూడా.. 

వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా అక్టోబర్ 9 మరియు 10 తేదీలలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 9న న్యూజిలాండ్- నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌ జరగనుండగా.. అక్టోబర్ 10న పాకిస్థాన్- శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస రోజుల్లో షెడ్యూల్ ఉండటం.. పాకిస్తాన్ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో పోలీసులు అవసరమయ్యే అవకాశం ఉన్నందున భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు చెప్పినట్లు ఓ జాతీయ ఛానల్ కథనాన్ని ప్రచురించింది.  

ALSOREAD:క్రికెట్ అభిమానులకు జియో సినిమా బంపర్ ఆఫర్.. ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్

కాగా, కొద్దిరోజల క్రితం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హెచ్‌సీఏ.. బీసీసీఐకి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం స్పందించిన బీసీసీఐ వైస్ ప్రసిడెంట్ రాజీవ్ శుక్లా రీషెడ్యూల్ చేయటం కుదరదని తెలిపారు. ఇప్పుడు మరోసారి ఈ -మెయిల్ పంపటం ఎటు దారితీస్తుందో అంతుపట్టడం లేదు. రీషెడ్యూల్ చేయటం వీలు కానియెడల మ్యాచ్‌లను మరొకచోటికి తరలిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

అక్టోబర్ 5 న అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది.