మనదేశంలో క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. మాజీ ఆటగాళ్లు గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్(రాజ్యసభ), హర్భజన్ సింగ్(రాజ్యసభ)లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చేరనున్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో యువీ.. ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి అతను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల యువీ.. తన తల్లి షబ్నమ్‌తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం జోరందుకుంది.
ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ కొనసాగుతున్నారు. ఈయన 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందారు. మునుపటి తరం బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఈ నియోజకవర్గం నుంచే పలుమార్లు ఎంపీగా గెలిచారు. 1998, 1999, 2004, 2014లో వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ ఎంపీగా గెలుపొందారు. ఈ స్థానం భారత్-పాకిస్తాన్ బోర్డర్‌ను ఆనుకుని ఉంటుంది. అయితే, దీనిపై అటు యువీ గానీ, ఇటు బీజేపీ ప్రభుత్వం గానీ స్పందించింది లేదు.
బ్రాడ్ పాలిట శత్రువు
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువీ పరుగుల వరద పారించాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచి చరిత్ర సృష్టించాడు. అనంతరం సొంతగడ్డపై జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ యూవీ మెరిశాడు. బ్యాటుతో, బంతితో రాణించి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు సొంతంచేసుకున్నాడు. అనంతరం క్యాన్సర్(మెడియస్టినల్ సెమినోమా) బారిన పడిన యువీ.. కీమోథెరపీ చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్స్‌లో ఆడుతున్న యువీ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.