IPL 2024: మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్..టీ20 వరల్డ్ కప్ కోసం మాస్టర్ ప్లాన్

IPL 2024: మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్..టీ20 వరల్డ్ కప్ కోసం మాస్టర్ ప్లాన్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. టీ20ల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. సాధారణంగా వన్డేల్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే రాహుల్.. టెస్ట్, టీ20ల్లో ఓపెనర్ గా ఆడతాడు. అయితే టీ20ల్లో కూడా మిడిల్ ఆర్డర్ ఆడాలని నిర్ణయించుకున్నాడట. వచ్చే ఏడాది ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ తరపున మిడిల్ ఆర్డర్ లో రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. 

లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ఐపీఎల్ లో ఓపెనర్ గానే బరిలోకి దిగాడు. గతంలో బెంగళూరు జట్టు తరపున మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసి దుమ్మురేపిన కేఎల్.. మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అసలు రాహుల్ మిడిల్ ఆర్డర్ లో ఆడటానికి కారణమేంటని పరిశీలిస్తే 2024 టీ20 వరల్డ్ కప్ అని తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా టాపార్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. రోహిత్, విరాట్ లాంటి సీనియర్ ప్లేయర్లతో పాటు కిషాన్, గైక్వాడ్, జైస్వాల్, గిల్ టాప్ ఆర్డర్ లో అదరగొట్టేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రాహుల్ టాప్ ఆర్డర్ లో చోటు దక్కడం అసాధ్యంగానే కనిపిస్తుంది. దీంతో ఈ స్టార్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. రాహుల్ మిడిల్ ఆర్డర్ లో రాణిస్తే టీ20 వరల్డ్ కప్ కోసం వికెట్ కీపర్ బ్యాటర్ రేస్ లో ఖచ్చితంగా ఉంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో క్వింటన్ డి కాక్, కైల్ మేయర్స్, దేవదత్ పడిక్కల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండడంతో రాహుల్ మిడిల్ ఆర్డర్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. 

దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా వన్డే, టెస్టు ఫార్మాట్ కు ఎంపికైన రాహుల్.. టీ20 లకు మాత్రం సెలక్ట్ కాలేదు. ఐపీఎల్ ను దృష్టలో పెట్టుకొని వరల్డ్ కప్ సెలక్షన్ ఉండడంతో భారత జట్టులో చోటు సంపాదించాలంటే మిడిల్ ఆర్డర్ లో రాహుల్ రాణించాల్సిందే. చివరి రెండు(2021,2022) టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో పాటు రాహుల్ ఓపెనింగ్ చేసి దారుణంగా విఫలమయ్యాడు.