Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. జట్లని ప్రకటించడానికి అదే చివరి తేదీ

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. జట్లని ప్రకటించడానికి అదే చివరి తేదీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.  త్వరలోనే ఐసీసీ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పాకిస్థాన్, యూఏఈ రెండు దేశాలు మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు దాయాది దేశం ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ తమ జట్టును ఎంపిక చేయగా.. మిగిలిన 7 దేశాలు తమ స్క్వాడ్ ను ప్రకటించాల్సి ఉంది. జనవరి 12 న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు తమ జట్లను ప్రకటించడానికి చివరి తేదీ అని తెలుస్తుంది. రిపోర్ట్స్  ప్రకారం ఐసీసీ జనవరి 12 వ తేదీని ఫైనల్ చేసినట్టు సమాచారం. 

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనున్నట్లు క్రిక్‍ఇన్ఫో నివేదించింది. భారత్, పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగానే జరిగే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తే.. యూఏఈలోనే సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ టోర్నీలో దాయాది జట్టు ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ తో కరాచీ గడ్డపై తలపడనుంది. ఇదే టోర్నీ ప్రారంభ మ్యాచ్. మార్చి 4, మార్చి 5 తేదీల్లో సెమీఫైనల్స్ ఉంటాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. త్వరలోనే ఐసీసీ అధికారికంగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ప్రకటించనుంది. మొత్తం 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనుండగా.. వీటిని రెండు గ్రూప్‍లు విడగొట్టారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్‍బీలో అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉన్నట్లు సమాచారం.