- కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా మిల్లెట్స్ చిక్కిస్ విక్రయాలు
- జిల్లా, మండల, గ్రామ సమాఖ్య సభ్యులకు ఆదాయం
- తక్కువ ధరకు కంపెనీ సరఫరా
- త్వరలో మరికొన్ని ఉత్పత్తులు అమ్మకం
మహిళలకు ఆరోగ్యంతో పాటు ఆదాయం సమకూరేలా కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఓ అడుగు ముందుకేసింది. మిల్లెట్స్ చిక్కిస్ అమ్మకాల కోసం ఓ కంపనీతో కామారెడ్డి జిల్లా సమాఖ్య ఎంవోయూ ( అవగాహన ఒప్పందం) చేసుకుంది. తక్కువ ధరకు మహిళలకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఉత్పత్తులను అందించటంతో పాటు తద్వారా మహిళా సమాఖ్యలకు ఆదాయం పొందేలా చూడటం ఒప్పంద ఉద్దేశం. ఇప్పటికే మిల్లెట్స్ చిక్కిస్ అమ్మకాలు మొదలయ్యాయి. ఆహార ఉత్పత్తుల అమ్మకం ద్వారా జిల్లా, మండల, గ్రామ సమాఖ్య సభ్యులకు ఆదాయం రానుంది. త్వరలో మిరికొన్ని ప్రొడక్ట్స్ కూడా మహిళా సమాఖ్యల ద్వారా అమ్మకాలు చేయనున్నారు.
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో 1,745 మహిళా సమాఖ్యలు ఉన్నాయి. ఇందులో 1,79,068 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా సమాఖ్యతో పాటు 22 మండల సమాఖ్యలు ఉన్నాయి. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో మహిళలు వ్యాపారాలు చేస్తున్నారు. తాజాగా మిల్లెట్స్ చిక్కిస్ అమ్మకాల కోసం మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ కంపెనీతో జిల్లా సమాఖ్య ఎంవోయూ కుదుర్చుకుంది.
జిల్లాలో మహిళలు, కిషోర బాలికలు రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, అనారోగ్యం సమస్యలతో రక్తహీనతకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు దొరికే బెల్లం, పోషకాలు ఇచ్చే వాటితో తయారు చేసిన పల్లిపట్టీలు, నువ్వుల పట్టీలు ( చిక్కిస్) తీసుకుంటే రక్తహీనత సమస్యనుంచి బయటపడొచ్చు. ప్రస్తుతం బెల్లం, పల్లీలు, జొన్నలతో చేసిన చిక్కిస్ సప్లయ్ చేస్తున్నారు.
మిల్లెట్స్ చిక్కిస్ వ్యాపారం ఇలా..
మిల్లెట్స్చిక్కిస్ను మహిళా సంఘాల ద్వారా మొదట మహిళలకు, ఆ తర్వాత హాస్టళ్లు, ఇతర సంస్థలకు సప్లయ్ చేయనున్నారు. ఇప్పటికే గ్రామ మహిళా సమాఖ్యలకు సప్లయ్ చేస్తున్నారు. మిల్లెట్స్ చిక్కిస్ అమ్మకం ద్వారా జిల్లా, మండల సమాఖ్యలతో పాటు, అమ్మకాలు చేసే గ్రామ సమాఖ్య సభ్యులకు ఆదాయం వస్తుంది. ఎమ్మార్పీ ధర రూ.5. కొనుగోలుదారులకు ఒకటి రూ. 4.33 పైసలకు అమ్మనున్నారు. ఒక ప్యాకెట్లో 30 ఉంటాయి. తయారు చేసే కంపనీ జిల్లా సమాఖ్యకు ఒకటి రూ.3.50కు ఇస్తుంది.
జిల్లా సమాఖ్య మండల సమాఖ్యకు రూ.3.70 పైసలకు, మండల సమాఖ్య గ్రామ సమాఖ్య సభ్యులకు రూ.3.95 పైసలకు ఇవ్వనుంది. గ్రామ సమాఖ్య సభ్యులు రూ. 4.33 పైసలకు విక్రయిస్తారు. 30 పీస్‌లు ఉండే ఒక ప్యాకెట్ కొనుగోలుదారులకు రూ. 130కి దొరుకుతుంది.లక్ష ప్యాకెట్ల( 30 లక్షల మిల్లెట్ చిక్కిస్) అమ్మకం ద్వారా జిల్లా సమాఖ్యకు రూ.6 లక్షలు, మండల సమాఖ్యలకు రూ.7.50 లక్షలు, గ్రామ సమాఖ్య సభ్యులకు రూ.11.40 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్లతో పాటు, గ్రామ సమాఖ్యల ద్వారా సభ్యులకు విక్రయిస్తున్నారు.
క్షేత్ర స్థాయిలో అమ్మకాల ఆధారంగా కంపెనీకి జిల్లా సమాఖ్య ఆర్డర్ పెట్టి సరుకు తీసుకుంటుంది. ఏ మండల సమాఖ్యకు చిక్కిస్ అవసరమో వారికి నేరుగా సప్లయ్ చేస్తున్నారు. ముందుగా పెట్టుబడి లేకుండానే ఈ వ్యాపారం సాగుతోంది. మొదట మహిళా సంఘాల సభ్యులకు అమ్మకాలు చేపట్టి క్రమంగా ఈ వ్యాపారం విస్తరించేందుకు ఐకేపీ అధికారుల ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహించే మీటింగ్స్‌లో కూడా ఈ మిల్లెట్స్చిక్కిస్ సప్లయ్ చేయనున్నారు. రానున్న రోజుల్లో హాస్టల్స్, ఇతర సంస్థలకు విక్రయించేందుకు ఆలోచిస్తున్నారు.