గ్రాండ్​గా రిపబ్లిక్​ డే .. ఖమ్మం జిల్లాను ఫస్ట్​ ప్లేస్​లో నిలుపుతాం : కలెక్టర్ గౌతమ్

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రిపబ్లిక్​ డే వేడుకలను గ్రాండ్​గా నిర్వహించారు.  ఖమ్మం జిల్లా కేంద్రంలోని పోలీస్​ పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్​ గౌతమ్, కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలోని వేడుకల్లో కలెక్టర్​ ప్రియాంక అల జెండా ఎగురవేశారు. గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ స్కీమ్స్ ను అర్హులైన ప్రజలకు అందించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్లు తెలిపారు.

అనంతరం వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్లు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. అభివృద్ధి పథకాల అమలుపై  ఆయా శాఖల శకటాల ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా చోట్ల పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  

జిల్లాను ఫస్ట్​ ప్లేస్​లో నిలుపుతాం : గౌతమ్

ఖమ్మం టౌన్​ :  ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలుపుతామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా  జిల్లా అభివృద్ధి నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రజపాలనను అందించే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. జిల్లాలో 589 గ్రామ పంచాయతీ లు,125 వార్డులు, 714 ఏరియాలలో గ్రామ సభలు నిర్వహించినట్లు తెలిపారు.

4 ,71 ,425 ఫ్యామిలీల నుంచి అభయహస్తం గ్యారంటీల కింద 4 ,88,316 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా 122 పల్లె వెలుగు, 90 ఎక్స్ ప్రెస్ సర్వీస్  బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11.77 లక్షల ఉచిత ప్రయాణ టిక్కెట్లు అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే ఇతర పథకాలను వివరించారు. 

కొత్త ఆయకట్టుకు నీళ్లు

సీతారామ ఎత్తిపోతల కింద పాలేరు లింకు కాల్వను 47,381 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. పాలేరు రిజర్వాయర్ దిగువనున్న నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, వైరా రిజర్వాయర్, లంకా సాగర్ ప్రాజెక్ట్ లలో నీటి వసతి తక్కువగా ఉన్నప్పుడు సాగర్ నీరు పంపిణీ చేసేందుకు సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. జాలిముడి, పండ్రెగిపల్లి, మున్నేరు రక్షణ గోడ,చెక్ డ్యామ్​ల వర్క్స్ పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. రోడ్ల పనులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చేపట్టిన చర్యలు, రైతుబంధు, పంట రుణమాఫీ తదితర విషయాలను వివరించారు. 

పల్లెల అభివృద్ధికి కృషి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  పల్లెలను అభివృద్ధిలో కళకళలాడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు రిపబ్లిక్​ డే వేడుకల్లో ఆమె మాట్లాడుతూ రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. మహాలక్ష్మి స్కీం ద్వారా డిసెంబర్​ 9 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 10,19,201 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని తెలిపారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్​ ఆరోగ్యశ్రీ స్కీంను రూ. 10లక్షల వరకు పెంచి ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రజల వద్ద నుంచి 3,34,227దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ పోర్టల్​లో నూరు శాతం అప్​ లోడ్​ చేశామన్నారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల సమష్టి కృషితోనే జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.