అన్నం మిగిలిపోతే.. కూర చెయ్యడానికి కుదరకపోతే.. ఆఫీస్ కి టైం అయిపోతుంటే... హైరాన పడకుండా.. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు.. వేడి వేడి అన్నాన్ని వాముతో తాలింపు వేసి తినొచ్చు.. మసాల రైస్ చేసి, రైతాతో తినొచ్చు... కూరల్లో తీసిపారేసే కరివేపాకుతో ఘుమఘుమలాడే కరివేపాకు అన్నం... కమ్మగా ఉండే కొబ్బరి అన్నం కూడా చేసి పిల్లల లంచ్ బాక్సుల్లో పెడితే వాళ్లు ఎంతో హ్యాపీ ఫీలవుతారు.
మసాలా రైస్
కావాల్సినవి :
బియ్యం రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు (చిన్నవిగా తరిగినవి)
ఆవాలు : ఒక టీ స్పూన్
బిర్యానీ ఆకులు : రెండు
యాలకులు : రెండు
ధనియాలు : రెండు టేబుల్ స్పూన్లు
మిరియాలు : పావు టీ స్పూన్
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
దాల్చిన చెక్క : రెండు (చిన్నవి)
మరాఠీ మొగ్గ : ఒకటి
ఎండు మిర్చి : రెండు
ఎండుకొబ్బరి ముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి : మూడు (సన్నగా తరిగినవి)
ఉల్లిపాయ ముక్కలు : అరకప్పు
టొమాటో ముక్కలు : ఒక కప్పు (చిన్నగా తరిగినవి)
ఆలూ ముక్కలు : అర కప్పు (చిన్నగా తరిగినవి)
పసుపు : పావు టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ : పావు టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు : అర టేబుల్ స్పూన్
కారం: ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
పుదీనా తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టాలి. తర్వాత స్టవ్పై పాన్ పెట్టి నూనె వెయ్యకుండా ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ రెండు నిమిషాలు వేగించి తర్వాత మిక్సీ పట్టాలి. ఒక వెడల్పైన బాండీ స్టవ్ పై పెట్టి నెయ్యి, నూనె వేసి వేడి చెయ్యాలి. దానిలో ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. తర్వాత ఆలూ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గ నివ్వాలి. తర్వాత మిక్సీ పట్టిన మసాల పొడి, నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అవి వేగాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి పదినిమిషా లు ఉడకబెట్టి మూత తీసి ఒకసారి కలపాలి. తర్వాత కలుపుతూ మరో పది నిమిషాలు ఉడికించి కొత్తిమీర, పుదీనా తరుగు వెయ్యాలి. అవి వేసాక రెండు నిమిషాలు ఉడికిస్తే వేడి వేడి 'మసాలా అన్నం' రెడీ. రైతాతో తింటే సూపర్గా ఉంటుంది
కరివేపాకు రైస్
కావాల్సినవి :
కరివేపాకు : ఒక కప్పు
పల్లీలు : మూడు టేబుల్ స్పూన్లు
అల్లం తరుగు : ఒక టీ స్పూన్
పచ్చిశనగ పప్పు : రెండు టేబుల్ స్పూన్లు
మినపప్పు : రెండు టేబుల్ స్పూన్లు
ధనియాలు : ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర : ఒక టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : ఆరు
పచ్చిమిర్చి : ఆరు (సన్నగా తరిగినవి)
చింతపండు : చిన్న నిమ్మకాయ సైజు
నువ్వులు : ఒక టేబుల్ స్పూన్
జీడిపప్పు : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : పావు టీస్పూన్
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
తయారీ :
స్టవ్పై పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి చెయ్యాలి. దానిలో అల్లం ముక్కలు, కొద్దిగా పల్లీలు, అర స్పూన్ శెనగపప్పు, అర స్పూన్ మీనపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి అవి కొద్దిసేపు వేగాక చింతపండు, నువ్వులు వేసి వేగించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక నిముషం పాటు వేగించాలి. అవి కొంచం పచ్చిగా ఉండగానే స్టవ్ ఆఫ్ చెయ్యాలి. లేకపోతే.. వాటి ఫ్లేవర్ తగ్గిపోతుంది. అది చల్లారాక ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత స్టవ్పై బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగ పప్పు, మినపప్పు, పల్లీలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత దానిలో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి కలిపి కొద్దిసేపు వేగించాక అన్నం వేసి కలిపి రెండు నిమిషాలు వేగిస్తే రుచికరమైన 'కరివేపాకు అన్నం' రెడీ. జీడిపప్పుతో గార్నిష్ చేసి తింటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు రోజు తింటే జుట్టు రాలకుండా ఉంటుంది.
వాము రైస్
కావాల్సినవి :
అన్నం : ఒక కప్పు
వాము : రెండు టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి : నాలుగు
వెల్లుల్లి రెబ్బలు : ఆరు (కొద్దిగా దంచినవి)
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు : రెండు టేబుల్
ఉప్పు : తగినంత
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
బాండీ స్టవ్పై పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి. నూనెలో ముందు ఎండుమిర్చి వెయ్యాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి వేగించాలి. అవి వేగాక వాము వేసి వేగించాలి. తర్వాత అన్నం వేసి కలపాలి. రెండు నిమిషాల పాటు వేడిచేసి ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఆపై కొత్తిమీర చల్లితే వేడి వేడిగా 'వామన్నం' రెడీ. దీన్ని బాలింతలకు, చిన్న పిల్లలకు ఎక్కువగా పెడతారు. పెద్దవాళ్లు జ్వరం వచ్చినప్పుడు తింటే మంచిది. ఇది కడుపులో ఉన్న చెడు అంతా పోగొడుతుంది. అజీర్తి ఉన్నవాళ్లు రెగ్యులర్గా తింటే అది తగ్గుముఖం పడుతుంది.
కొబ్బరి రైస్
కొబ్బరి పాలు : రెండు కప్పులు
బియ్యం : ఒక కప్పు
పచ్చిమిర్చి : ఆరు (సన్నగా తరిగినవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
యాలకులు : రెండు
దాల్చిన చెక్క : రెండు
లవంగాలు : రెండు
జీడిపప్పు : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
కొత్తిమీర తరుగు : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
బియ్యం అర గంట ముందు కడిగి పెట్టాలి. ఒక వెడల్పైన గిన్నెలో బియ్యం, పచ్చిమిర్చి, కరివేపాకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, పసుపు. ఉప్పు, కొబ్బరిపాలు వేసి కలిపి స్టవ్ పై పెట్టి మూత పెట్టాలి. పదినిమిషాలు ఉడికాక మిశ్రమాన్ని ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టాలి. మరో పది నిమిషాలు ఉడికితే 'కొబ్బరి అన్నం' రెడీ. కొత్తిమీర, జీడిపప్పు గార్నిష్ చేసి తింటే సూపర్. ఇది వేడిగా తినొచ్చు, చల్లారాక కూడా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్ల్లో కూడా పెట్టొచ్చు.
ALSO READ | Household Hints & Tips : ఇంటికి తాళం వేసే ముందు ఒకటికి రెండు సార్లు వీటిని చెక్ చేసుకోండి.. మర్చిపోవద్దు..!