వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీలో ఉన్న కమలా హారిస్ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కన్నా అసమర్థురాలు అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రెసిడెంట్ గా కమల గెలిస్తే అమెరికా సర్వ నాశనం అవుతుందని ఆరోపించారు. టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఆడియోను సోమవారం రాత్రి ఎక్స్ లో పోస్ట్ చేయగా కొన్ని గంటల్లోనే 20 కోట్లకుపైగా మంది విన్నారు.
ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘కమలా హారిస్ వామపక్ష అతివాద భావజాలం ఉన్న నాయకురాలు. డెమోక్రటిక్ పార్టీలో జరిగిన కుట్ర వల్లే ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ తప్పుకుని ఆమె తెరపైకి వచ్చారు. అధ్యక్షురాలిగా ఆమె గెలిస్తే దేశంలోకి కోట్లాది మంది అతివాద భావజాలం ఉన్న వాళ్లు ఐదారు కోట్ల మంది ప్రవేశిస్తారు. నేరాలు పెరుగుతాయి. దేశం నాశనం అవుతుంది” అని ఆరోపించారు.
తాను అధ్యక్షుడిగా గెలిస్తే వలసల చట్టాన్ని కఠినతరం చేస్తానని, దేశం నుంచి పెద్ద సంఖ్యలో బహిష్కరణలు విధిస్తానని ట్రంప్ చెప్పారు. బైడెన్ విదేశాంగ విధానం చాలా దారుణంగా ఉందన్నారు. తాను ప్రెసిడెంట్ గా ఉంటే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేసేది కాదన్నారు. ఇటీవల తనపై కాల్పులు జరగగా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డానని, దేవుడిపై నమ్మకం పెరిగిందన్నారు.
ఓడితే వెనెజులా వెళ్లిపోతా..
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే తాను వెనెజులాకు వెళ్లిపోతానని ట్రంప్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘వెనెజులాలో కరడుగట్టిన నేరస్తులను జైళ్ల నుంచి రిలీజ్ చేస్తున్నారు. వారిని అమెరికాకు పంపి క్రైమ్ రేట్ ను తగ్గించుకుంటున్నారు. అందుకే మన దేశం కంటే వెనెజులానే సేఫ్ ప్లేస్ అవుతుంది” అని అన్నారు. దేశంలోకి క్రిమినల్స్ రాకుండా అడ్డుకోవాలన్నదే తన ప్రయత్నమని, అందుకే ఎన్నికల్లో తాను గెలవాలన్నారు.
కమలా హారిస్కూ మస్క్ ఆహ్వానం
డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ను కూడా ఇంటర్వ్యూ చేసేందుకు తాను సిద్ధమని మస్క్ ప్రకటించారు. ఇంటర్వ్యూకు రావాలని కమలను ఆహ్వానించారు. ట్రంప్ కు అనుకూలంగా ఉన్న మస్క్ ఆయనకు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చారు. అయితే, మస్క్ ఆహ్వానంపై కమలా హారిస్ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, టెక్నికల్ సమస్యల కారణంగా ఇంటర్వ్యూ దాదాపు 40 నిమిషాలు ఆలస్యమైంది. ఎక్స్పై డీడీఓఎస్ అటాక్ జరిగినందుకే ఇంటర్వ్యూ ఆలస్యమైందని మస్క్ తెలిపారు.