నీళ్లు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కు వినతి

ఖమ్మం, వెలుగు: నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి, పంటలను కాపాడాలని సీపీఎం నేతలు కోరారు. బుధవారం మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చెరువుల్లోని నీళ్లు అయిపోయాయని, భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని చెప్పారు. నీరు లేకపోతే పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్‌‌, రాష్ట్ర నాయకులు శోభన్‌‌నాయక్‌‌, జిల్లా నాయకులు ఎస్‌‌.నవీన్‌‌రెడ్డి, రాయల శ్రీనివాస్‌‌ పాల్గొన్నారు.