సూర్యాపేటలో దామన్నకు సీటు దక్కేనా?

  •    సూర్యాపేట పైనే అందరి గురి
  •     తుంగతుర్తిలో మోత్కుపల్లి వర్సెస్​ ఆశావహులు
  •     మిర్యాలగూడ, మనుగోడు కాంగ్రెస్​లో ముసలం

నల్గొండ, వెలుగు :  ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ హైకమాండ్​ పెండింగ్​లో పెట్టిన మూడు స్థానాల పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామో దర్​రెడ్డి ఆశిస్తున్న సూర్యాపేట సెగ్మెంట్​ పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహారించిన ఎంపీలు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామన్న విషయంలో ఏవిధంగా వ్యవహారిస్తారన్నది చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ వాదుల్లో దామోదర్​ రెడ్డి కూడా ప్రధానమైన వ్యక్తి. 71 ఏళ్ల వయసు కలిగిన ఆయన ఇదే తనకు చివరి ఎన్నిక అని, ఫైనల్​ చాన్స్​ ఇవ్వాలని హైకమాండ్​ను ఇప్పటికే పలుమార్లు అభ్యర్థించారు. పీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్​ రమేశ్​రెడ్డి పోటీ పడుతుండంతో ఈ సీటు పైన సస్పెన్స్​ నెలకొంది. 19 85 నుంచి కాంగ్రెస్​ పార్టీకి లాయలిస్టుగా ఉన్న దామన్న ఇప్పటిదాక పార్టీ లైన్ ​దాటలేదనే పేరు ఉంది. 38 ఏళ్ల నుంచి కాంగ్రెస్​ పార్టీనే నమ్మకున్న ఆయన ఈ వయసులో టికెట్​ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తుంగతుర్తిలో నాలుగుసార్లు, సూర్యాపేటలో ఒకసారి ఎమ్మె ల్యేగా గెలిచిన దామన్న తొలిసారిగా 1991లో నేదురమల్లి జనార్ధన్​ రెడ్డి కేబినెట్​లో ఒకసారి, 2007లో వైఎస్​ కేబినెట్​లో మరోసారి మంత్రిగా పనిచేశా రు. 1994లో మాత్రం పార్టీ టికెట్​ ఇవ్వకపోడంతో దామన్న ఒక్కడే తుంగతుర్తి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత కాంగ్రెస్​లో చేరారు. 

తుంగతుర్తిలో ఆశావహులకు షాక్​

తుంగతుర్తి సీటు పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులకు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రూపంలో షాక్​ తగిలింది. తాజాగా బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన ఆయన తుంగతుర్తి టికెట్​ఆశిస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో పాటు మాదిగ సామాజికవర్గం ఓటర్లు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారు. దీంతో మాల సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మె ల్యే గాదరి కిషోర్​ కుమార్​కు దీటైన అభ్యర్థి మోత్కుపల్లి అన్నట్టుగానే భావిస్తున్నారు. అయితే రేవంత్​వర్గానికి చెందిన అద్దంకి దయాకర్​తోపాటు, జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్య సైతం రేసులో ఉన్నారు.

మిర్యాలగూడ..మునుగోడులో... 

మిర్యాలగూడ సీటు పైన కాంగ్రెస్​, సీపీఎం మధ్యలో వార్​ నడుస్తోంది. కాం గ్రెస్​ నేత బత్తుల లక్ష్మారెడ్డి సహకరిస్తే సీపీఎం పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. కానీ స్థానిక పరిస్థితులు మాత్రం పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా సీపీఎంకు ఇచ్చిన మరుక్షణం మిర్యాలగూడ కాంగ్రెస్​ కేడర్​ చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది. బత్తుల లక్ష్మారెడ్డి సరియైన అభ్యర్థి అని పార్టీ చేసిన సర్వేలు చెపుతున్నాయి. కానీ పొత్తు ధర్మం పాటించాల్సిన పరిస్థితులు వస్తే మునుగోడు తరహాలోనే అసంతృప్తి సెగ లు మిర్యాలగూడలో భగ్గుమంటాయని హెచ్చరిస్తున్నారు.

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డికి టికెట్​ అనౌన్స్​ చేయడంతో ఆశావహులు చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్​ నేత శనివారం పార్టీ కేడర్​తో ప్రత్యేకంగా మీటింగ్​లు పెట్టారు. రాజగోపాల్​ రెడ్డి పైన నిప్పులు చెరిగిన వారంతా భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు తమ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు.