బెక్కన్ ఇన్ ఫ్రాకు రెరా షాక్ .. ఫ్లాట్ల రిజిస్ర్టేషన్లు ఆపాలని ఆదేశం

బెక్కన్ ఇన్ ఫ్రాకు రెరా షాక్ .. ఫ్లాట్ల రిజిస్ర్టేషన్లు ఆపాలని ఆదేశం
  • అనుమతి లేకుండా అదనపు ఫ్లోర్ల నిర్మాణం 
  • ఐదేండ్లయినా కొనుగోలు దారులకు ఫ్లాట్లు అప్పగించలే  

హైదరాబాద్, వెలుగు: అనుమతులు తీసుకోకుండా అదనపు ఫ్లోర్లను నిర్మించడంతో పాటు ఫ్లాట్లను కొనుగోలుదారులకు అమ్మి, వాటిని హ్యాండోవర్ చేయని బెక్కన్ ఇన్ ఫ్రాకు రెరా షాకిచ్చింది.  తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లను ఆపాలని ఆదేశాలిచ్చింది. హెచ్ఎండీఏ పరిధిలోని మేడ్చల్ జిల్లా కొంపల్లి తండా దగ్గర బెకున్ లైఫ్ స్టైల్ పేరుతో బెక్కన్ ఇన్ ఫ్రా భారీ అపార్ట్ మెంట్లను నిర్మిస్తున్నది.

అయితే నాలుగు బ్లాకుల్లో 7 ఫ్లోర్ల వరకు అనుమతి తీసుకొని 9 ఫ్లోర్లను నిర్మించారు. 2019లో ఈ ప్రాజెక్టు ను స్టార్ట్ చేయగా, 2021లోగా కొనుగోలుదారులకు ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పారు. దీంతో 200 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ఐదేండ్లు గడుస్తున్నా ఇంత వరకు ప్రాజెక్టు పూర్తికాకపోవటంతో పాటు ఏ, డీ, ఈ బ్లాక్ ల నిర్మాణ పనులు ఇంత వరకు స్టార్ట్ కాలేదు. ఇప్పటికే నిర్మించిన కొన్ని ఫ్లాట్లను కంపెనీ అమ్మింది.

ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయటానికి ఫండ్స్ లేవని కంపెనీ చెప్పడం, కొనుగోలుదారులు బిల్డర్లను ఎన్నిసార్లు అడిగినా వారి దగ్గరి నుంచి సరైన సమాధానం రాకపోవటంతో బాధితులు రెరాను ఆశ్రయించారు. దీనిపై రెరా చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ, మెంబర్లు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ విచారించి తీర్పు ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న బ్లాకుల నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు హ్యాండోవర్ చేసే వరకు 8,9 ఫ్లోర్లలో నిర్మాణాలు చేయొద్దని అందులో వెల్లడించారు.

నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలించడానికి కొనుగోలుదారులను అనుమతించాలని చెప్పారు. ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరిచి కొనుగోలుదారులు కట్టిన డబ్బులను అందులో జమ చేసి ప్రాజెక్టు పనులు చేపట్టాలని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రిజిస్ర్టేషన్లు ఆపాలని ఆదేశించారు. ఈ తీర్పును ఉల్లంఘిస్తే రెరా యాక్ట్  2016 ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలుదారుల సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ తీర్పు అమల్లో ఉంటుందని వెల్లడించారు. కౌంటర్ దాఖలు చేసుకునే అవకాశం బెక్కన్ ఇన్ ఫ్రాకు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.