
- టీబీఎం పరిసరాల్లో సంచరించిన క్యాడవర్ డాగ్స్
- వారం కింద జీపీఆర్ స్కానర్ గుర్తించిన ప్లేస్‌లనే హైలైట్ చేసిన డాగ్స్
- టీబీఎంను పూర్తిగా తొలగిస్తేనే ఆచూకీ దొరికే అవకాశం
ఎస్‌ఎల్‌బీసీ నుంచి వెలుగు టీం: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన చోట రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ కనిపెట్టేందుకు కేరళ నుంచి రప్పించిన క్యాడవర్ డాగ్స్‌ను శుక్రవారం టన్నెల్‌లోకి తీసుకెళ్లారు. 13.800 కిలోమీటర్ వద్ద మట్టిలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాల్లో డాగ్స్ గుర్తించిన ప్లేస్‌లను మార్క్ చేశారు. వారం రోజుల కింద ఎన్‌జీఆర్‌ఐ బృందం జీపీఆర్‌తో ఇవే ప్రదేశాలను గుర్తించడం గమనార్హం.
మట్టి తొలగింపునకు చర్యలు
వారం రోజుల కింద టన్నెల్‌లో జీపీఆర్ పరికరంతో సెర్చ్ చేయగా టన్నెల్ బోర్ వెనుక భాగంలో నలుగురు, మధ్యలో రెండు చోట్ల నలుగురు ఉన్నట్లు గుర్తించి మూడు మీటర్ల వరకు తవ్వారు. అయితే టీబీఎంకు సంబంధించిన భాగాలు మాత్రమే దొరకడంతో తవ్వకాన్ని ఆపేశారు. తాజాగా క్యాడవర్ డాగ్స్ సైతం అవే ప్రాంతాలను హైలైట్ చేయడంతో మళ్లీ అక్కడే తవ్వాలని నిర్ణయించారు.
టీబీఎం వెనుక భాగంలో మట్టిని తొలగించి గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. టీబీఎం పక్కన పేరుకుపోయిన బురదను వాటర్ జెట్లతో తొలగిస్తున్నారు. టీబీఎంను పూర్తిగా తొలగిస్తే కానీ ఎనిమిది మంది అవశేషాలు లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీనికి ఎంత టైం పడుతుందో అంచనా వేయలేకపోతున్నారు. టీబీఎం పరిసరాల్లో 200 మీటర్ల పొడవునా 15 ఫీట్ల వరకు మట్టి, బురద పేరుకుపోయింది. డ్రిల్లింగ్ చేసే అవకాశం లేకపోవడంతో ఎస్కవేటర్లు, గడ్డపారలతో మట్టిని తవ్వుతున్నారు.
ఏన్‌వీ రోబోటిక్ టీమ్‌తో చర్చించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్
టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు రోబోలను వాడుకోవాలని సీఎం సూచించడంతో హైదరాబాద్‌కు చెందిన ఎన్‌వీ.రోబోటిక్ సర్వీసెస్‌కు చెందిన నలుగురు సభ్యులతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ చర్చించారు. రోబోటిక్ టీమ్ శుక్రవారం టన్నెల్‌లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. రోబోల వినియోగంపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.