టన్నెల్‌‌లో కొనసాగుతున్న రెస్క్యూ..టీబీఎంను కట్‌‌ చేస్తున్న వెల్డర్లు, కట్టర్లు

టన్నెల్‌‌లో కొనసాగుతున్న రెస్క్యూ..టీబీఎంను కట్‌‌ చేస్తున్న వెల్డర్లు, కట్టర్లు
  • తగ్గని నీటి ఊట.. ఆందోళనలో రెస్క్యూ టీమ్స్‌‌
  • మృతదేహాల ఆనవాళ్లపై అడుగంటుతున్న ఆశలు
  • రెస్క్యూ ఆపరేషన్‌‌ కొనసాగింపుపై సందిగ్ధం

నాగర్‌‌కర్నూల్‌‌/అచ్చంపేట, వెలుగు : ఎస్‌‌ఎస్‌‌బీసీ టన్నెల్‌‌లో రెస్క్యూ ఆపరేషన్‌‌ సోమవారం కూడా కొనసాగింది. ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌, సింగరేణి, ర్యాట్‌‌హోల్‌‌ మైనర్లు, ఎస్డీఆర్‌‌ఎఫ్‌‌, సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వే టీమ్స్‌‌ కలిసి 23 రోజులుగా తవ్వకాలు జరుపుతున్నా గల్లంతైన వారి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. టన్నెల్‌‌ చివరి నుంచి 43 మీటర్ల దూరంలో ఉన్న డీ1, టీబీఎం రెండో సైడ్‌‌లోని ఏ5 ప్రాంతాల్లో ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నారు.

ఇంకా ముందుకు వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్‌‌ భయపడుతున్నాయి. వాటర్‌‌ ఫోర్స్‌‌గా వస్తుండడంతో పాటు స్లైడింగ్‌‌ జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. 120 మీటర్ల పొడవు ఉండే టీబీఎంను పూర్తిగా తొలగిస్తే తప్ప మృతుల ఆనవాళ్లు దొరికే అవకాశం లేదని సమాచారం. 

టీబీఎం శిథిలాల తొలగింపే పెద్ద టాస్క్‌‌

120 మీటర్ల పొడవు,1500 టన్నుల బరువు ఉన్న టీబీఎం శిథిలాల తొలగింపు రెస్క్యూ టీమ్స్‌‌కు సవాల్‌‌గా మారుతోంది. సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వే, సింగరేణి, జేపీ కంపెనీ వెల్డర్లు, కట్టర్లు పనిచేస్తున్నారు. టీబీఎం మధ్య భాగంలో ఉండే భారీ ఎలక్ట్రికల్‌‌ సర్క్యూట్లు, పవర్‌‌ ట్రాన్స్‌‌ఫార్మర్లు, అగ్ని ప్రమాదాలను తట్టుకునే మందమైన షీట్లు, హైడ్రాలిక్‌‌ సిస్టమ్‌‌ను గ్యాస్‌‌కట్టర్లతో కట్‌‌ చేసి లోకో ట్రాలీ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.

ప్లాట్‌‌ఫాంను పూర్తిగా తొలగించిన తర్వాత మట్టి, రాళ్లు, బురదను ఎత్తిపోయాల్సి ఉంటుందని రెస్క్యూ టీం సభ్యుడొకరు తెలిపారు. టీబీఎం వెనుక భాగంలోని 13.600 కిలోమీటర్‌‌ వద్ద లోకో ఇంజిన్‌‌ అడ్డంగా ఇరుక్కుపోయింది. రోబో సర్వీసెస్‌‌కు టెక్నికల్‌‌ అవాంతరాలు ఇంకా తొలగిపోలేదు. మరో వైపు రెస్క్యూ ఆపరేషన్‌‌ కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత రెస్క్యూను నిలిపివేస్తారని సమాచారం.