పేరుకు పోయిన బురద.. రెస్క్యూ ఆపరేషన్​కు అడ్డంకులు.. మూడ్రోజులుగా టన్నెల్​లోనే

పేరుకు పోయిన బురద.. రెస్క్యూ ఆపరేషన్​కు అడ్డంకులు.. మూడ్రోజులుగా టన్నెల్​లోనే
  • 8 మందిని కాపాడేందుకు అడుగడుగునా ఆటంకాలు
  • ఆగని సీపేజ్​.. కూలుతున్న మట్టి పెల్లలు.. మరింత పేరుకుపోతున్న నీరు, బురద
  • ఆదివారం 13.4 కి.మీ. దాకా వెళ్లిన రెస్క్యూ టీమ్​లు​.. తాజాగా 11వ కి.మీ. వరకు బురద
  • పుష్ ​కెమెరాల ద్వారా లోపలివారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం
  • రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్
  • పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటిరెడ్డి

మహబూబ్​నగర్ ​/ నాగర్​కర్నూల్ / అమ్రాబాద్​, వెలుగు: ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో రెస్క్యూ ఆపరేషన్​కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. -ఘటనా స్థలం వద్ద సీపేజ్​ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడ్తుండడంతో బురద మరింత ముందుకొస్తున్నది. ఆదివారం13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీమ్​లు.. తాజాగా బురద, శిథిలాలు కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్​ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్లలేకపోతున్నాయి. 

ఢిల్లీ నుంచి తెప్పిం చిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్​ కూడా బురద లోంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి గానీ, పక్కల నుంచి గానీ హోల్​చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.  ఘటన జరిగి మూడు రోజులు దాటిపోతున్నా.. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్​ స్పాట్​ వద్దకు చేరుకోలేకపోయాయి. 

ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు.. యాక్సిడెంట్​ జరిగిన స్పాట్​ నుంచి తిరిగి వచ్చినప్పుడు 200 మీటర్ల వరకు ఉన్న మట్టి, బురద, శిథిలాలు​.. సోమవారం ఉదయం 11వ కిలోమీటరు వరకు కొట్టుకొచ్చింది. ప్రమాదం జరిగిన స్పాట్​ నుంచి 11వ కిలోమీటరు వరకు కొట్టుకొచ్చిన బురద, శిథిలాలు నాలుగు మీటర్ల ఎత్తుకు చేరింది. 

ఆదివారం 13.5 కిలోమీటరు వరకు అందుబాటులో ఉన్న కన్వేయర్​ బెల్టు కూడా తాజాగా బురదలో కూరుకుపోయింది. దీంతో రెస్క్యూ టీమ్స్​ ముందుకు వెళ్లలేకపోతున్నాయి. బయటి నుంచి లోపలికి వెళ్లడానికి అనువైన మార్గం దొరకక సహాయ బృందాలు ఇబ్బందులు పడ్తున్నాయి. ప్రమాదం జరిగిన చోట దాదాపు ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టి పేరుకుపోయినట్లు సమాచారం. 

ప్రస్తుతం టన్నెల్​లో రోజుకు వంద క్యూబిక్ మీటర్ల మట్టిని తోడిపోసే వ్యవస్థ మాత్రమే ఉంది. దీంతో ప్రస్తుతం మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తరలించడం రెస్క్యూ టీమ్స్​కు సవాలు​గా మారింది. మట్టిని కదిలించేందుకు హిటాచినీ,  పవర్​ కోసం జనరేటర్​ను రెస్క్యూ టీమ్స్​ లోపలికి తీసుకెళ్లాయి. 

పుష్ కెమెరాలతో గాలింపు

ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్​ పాయింట్​వద్ద చిక్కుకున్న 8 మంది పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్​ టెక్నాలజీని వాడుతున్నది. ఇందులో భాగంగా సొలినాస్​, ఎల్​ఎండ్​టీ కంపెనీల సమన్వయంతో పుష్ కెమెరాలను స్పాట్​ దగ్గరికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కెమెరాలను 11 కిలోమీటరు వద్ద పైపుల ద్వారా బురద లోంచి 14 కిలోమీటర్​ దాకా పంపించి, అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నారు. 

తద్వారా గల్లంతైన వారి పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2023లో ఉత్తర కాశీ వద్ద సికాయర టన్నెల్​లో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 41 మందిని ఈ ఎక్విప్​మెంట్​ ద్వారానే గుర్తించారు. ఒక వేళ ఈ ఎక్విప్​మెంట్​ ద్వారా కూడా ఏమి తేలకపోతే అదనంగా ఎండో-90 అనే రిమోట్ కంట్రోల్ పుష్ క్యామ్ మెషిన్ కూడా అందుబాటులో ఉంచారు. అవసరాన్ని బట్టి దానిని వాడాలని నిర్ణయించారు. 

మొరాయించిన లోకో ట్రెయిన్​

టన్నెల్​లోకి వెళ్లేందుకు ఒకే లోకో ట్రెయిన్​ అందుబాటులో ఉంది. ఘటన జరిగిన తర్వాత మూడు రోజులుగా ఈ వెహికల్​ను నిరంతరాయంగా తిప్పుతున్నారు. 11వ కిలోమీటరు పాయింట్​ వరకు రెస్క్యూ టీమ్స్​ను తీసుకుపోవడానికి దాదాపు 1.20 గంటల టైమ్​ పడుతున్నది. 

తిరిగి రావడానికి మరో 1.20 గంటలు పడుతున్నది. విజిటర్లు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఈ వెహికల్​ను బయటి నుంచి లోపలికి..లోపలి నుంచి బయటకు తిప్పుతుండటంతో లోకో తరుచూ మొరాయిస్తున్నది. ఈ వెహికల్​లో ఆదివారం అర్ధరాత్రి టన్నెల్​లోకి వెళ్లిన టీమ్​లు.. బుధవారం ఉదయం తిరిగి వచ్చే టైంలో ఈ లోకో ట్రెయిన్​లో సాంకేతిక సమస్య ఏర్పడింది. సమస్యను గుర్తించి క్లియర్​ చేయడంతో తిరిగి టన్నెల్​ నుంచి బయటకు వచ్చారు.   

రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

టన్నెల్​లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాట్ హోల్​ మైనర్స్​ను రంగంలోకి దింపింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్​కు రప్పించింది. సోమవారం ఉదయం వరకు మొత్తం 12 మంది టీమ్​ సభ్యులు టన్నెల్​ వద్దకు చేరుకున్నారు. కాగా.. వీరు ఉత్తరాఖండ్ సిలియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను  17 రోజులు రెస్క్యూ చేసి ప్రాణాలతో బయటకు తీశారు. 

వీరు యాక్సిండెంట్​ జరిగిన స్పాట్​కు చేరుకునేందుకు హోల్స్​ ఏర్పాటు చేస్తారు.  మనిషి మాత్రమే పట్టేంత సైజులో హోల్​తవ్వి, తర్వాత వాటిలోకి పైపులను పంపి,  అందులో నుంచి బాధితులను బయటకు తీసుకొస్తారు. ఈ తరహాలో ఎస్​ఎల్​బీసీ వద్ద రెస్క్యూ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసే క్రమంలో వీరిని రంగంలోకి దింపింది. 

కాగా, టన్నెల్​లో ప్రస్తుతం ఉన్న బురదలోంచి వీరు లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి గానీ, పక్కల నుంచి గానీ హోల్​చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. మంగళవారం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. మరోవైపు విశాఖపట్నం నుంచి నేవీ బృందాలు కూడా సోమవారం మధ్యాహ్నం టన్నెల్​ వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్​లో నిమగ్నమయ్యాయి.

పర్యవేక్షిస్తున్న మంత్రులు

ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి, ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే సోమవారం వీరితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, నాగార్జున సాగర్​ ఎమ్మెల్యే జైవీర్​ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

మ్యాప్ ద్వారా పరిస్థితిని వివరించిన ఆర్మీ

ఆదివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్​ లోపలికి వెళ్లాయి. తిరిగి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు బయటకు వచ్చాయి.  లోపల నెలకొన్న పరిస్థితిని బోర్డుపై డ్రాయింగ్ ద్వారా మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రమాద స్థలాన్ని ఏ, బీ, సీ, డీగా విభజించారు. ఏ నుంచి బీ వరకు ఘటన జరిగిన పాయింట్​ నుంచి 40 మీటర్ల వరకు శిథిలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

అక్కడ ఆరు నుంచి ఏడు ఫీట్ల హైట్​ వరకు శిథిలాలు పేరుకుపోయాయని చెప్పారు. డీ నుంచి సీ వరకు 2.26 కిలోమీటర్ల మేర నీరు నిలిచినట్లు వెల్లడించారు. అలాగే కన్వేయర్​ బెల్ట్​ పూర్తిగా పని చేయడం లేదన్నారు. 

పుష్ కెమెరాలతో పరిశీలిస్తం

మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు పుష్ కెమెరాలను పంపించొచ్చు. బురద, మట్టి, సీపేజ్​ ఉన్న ప్రాంతాల్లో వీటిని వాడతాం. సొలినాస్, ఎల్అండ్​టీ కంపెనీల సమన్వయంతో ఈ కెమెరాలను 120 మీటర్లకు ఒకటి, వంద మీటర్లకు మరొకటి అందుబాటులో ఉంచాం. 2023 లో ఉత్తర కాశీ వద్ద సిరికాల వద్ద టన్నెల్​లో జరిగిన ప్రమాదంలో గల్లంతైన వారిని ఈ ఎక్విప్​మెంట్​ ద్వారానే  గుర్తించాం. 

ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో చిక్కుకున్నవారి  పరిస్థితి ఎలా ఉందో కెమెరాల ద్వారా చూసి అంచనాకు రావచ్చు. అవసరమైతే ఎండో 90 అనే రిమోట్ కంట్రోల్ పుష్ క్యామ్ మెషిన్ కూడా అందుబాటులో ఉంచాం.

- లక్ష్మీనారాయణ, పుష్ క్యామ్ ఆపరేటర్