శిథిలాల కింద చిక్కుకున్నది ఇద్దరా... నలుగురా.?

శిథిలాల కింద చిక్కుకున్నది ఇద్దరా... నలుగురా.?

భద్రాచలం లో కూలిన జి ప్లస్ ఫైవ్ శ్రీపతి నిలయం భవనం దగ్గర  సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.  శిథిలాల కింద నుంచి బయటకు తీసిన మేస్త్రీ కామేష్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న మరో మేస్త్రీ ఉపేందర్ ను  బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 

అయితే శి థిలాల కింద ఎంత మంది ఉన్నారనేదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. యజమానులు ఇద్దరు కూలీలే ఉన్నారని చెబుతుండగా.. నలుగురు కూలీలు ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఇద్దరు మేస్త్రీలు నలుగురు కూలీలు ఉన్నారని సమాచారం.  స్నిపర్ డాగ్ లతో శిథిలాల లోపలికి వెలికి చూస్తోంది రెస్క్యూ టీమ్. శిథిలాల కింద ఉన్న ఉపేందర్ ఆచూకీ తెలపలేదంటూ అతని  కుటుంబ సభ్యులు బ్రిడ్జి సెంటర్ దగ్గరకు ఆందోళనకు దిగారు. మరో వైపు  శ్రీపతి నిలయం యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాత భవనంపైనే మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా మార్చి 26న ఈ ప్రమాదం జరిగింది. శ్రీ విజయ కనకదుర్గా భవానీ దేవస్థానంలో శ్రీపతి నేషనల్ ఫౌండేషన్ పేరిట శ్రీపతి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ భవనాన్ని నిర్మిస్తున్నాడు. 35 ఏండ్ల కిందటి పురాతన భవనాన్ని కొన్న శ్రీనివాసరావు.. దానిపైనే అదనంగా మరికొన్ని నిర్మాణాలు చేపడ్తున్నాడు. అయితే, ఈ నిర్మాణానికి గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తున్నది. 

9 అంగుళాల పిల్లర్లపైనే ఐదు అంతస్తులు

గ్రౌండ్ ఫ్లోర్ మినహా మిగిలిన ఐదు అంతస్తులను కూల్చేయాలని సెప్టెంబర్​లోనే మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే, శ్రీపతి శ్రీనివాసరావు ఇవేవీ పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగించాడు. అక్రమ నిర్మాణం గురించి ప్రశ్నించిన వారిపై కూడా ఆయన దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా కేవలం 9 అంగుళాల పిల్లర్లతో నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. కనీసం 14 నుంచి 20 అంగుళాల మేర పిల్లర్లు ఉంటేనే భవనం నిలబడుతుందని, ఎలాంటి ప్లాన్, నిపుణుల పర్యవేక్షణ లేకుండా నిర్మాణం జరుగుతున్నా పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పలువురు విమర్శిస్తున్నారు. ట్రస్టు పేరుతో శ్రీనివాసరావు వసూలు చేస్తున్న విరాళాలపై కూడా ఆరోపణలున్నాయి.కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సింగరేణి నుంచి రెస్క్యూ బృందాలను రప్పించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బిల్డింగ్ కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు.