
- దొరకని ఆరుగురు కార్మికుల ఆచూకీ
- చివరి ప్రాంతంలో ఊడిన సిమెంట్ దిమ్మె, భారీగా నీటి ఊట
- ఇక్కడ రెస్క్యూ కష్టమంటున్న నిపుణులు
- నేడు హైదరాబాద్‌లో జరిగే మీటింగ్‌లో నిర్ణయం
నాగర్‌కర్నూల్, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ప్రమాదం జరిగిన తర్వాత 253 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించిన రెస్క్యూ టీమ్స్‌కు.. చివరి 43 మీటర్ల ప్రాంతం సవాల్‌గా మారింది. ఈ పాయింట్‌ను అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించడంతో అక్కడ రెస్క్యూ కొనసాగిస్తారా ? లేక ఇక్కడితో ఆపేస్తారా ? అన్న సందేహం నెలకొంది. అయితే గురువారం హైదరాబాద్‌లో నిర్వహించే మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రెండు నెలల కింద ప్రమాదం
దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఇన్‌లెట్ వైపు 14వ కిలోమీటర్ వద్ద ఫిబ్రవరి 22న ప్రమాదం జరుగగా ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం ధాటికి 1600 బరువు, 150 మీటర్ల పొడవు ఉంటే టీబీఎం ముక్కలు ముక్కలై సుమారు 300 మీటర్ల వెనక్కి కొట్టుకువచ్చింది. టన్నెల్ చివరి భాగంలో టీబీఎం అక్కడే మట్టిలో కూరుకుపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, ర్యాట్‌హోల్ మైనర్లు, రైల్వే, సింగరేణి, హైడ్రా రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. కేరళ క్యాడవర్ డాగ్స్‌తో సైతం గాలింపు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతం షియర్ జోన్ కావడం, నిమిషానికి 10 వేల లీటర్ల నీటి ఊట వస్తుండంతో రెస్క్యూ ఆపరేషన్ ఛాలెంజింగ్‌గా మారింది.
నీటి ఊట, మట్టి, రాతిపొడి కలిసి కాంక్రీట్‌గా మారడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరకు రెస్క్యూ సిబ్బంది గ్యాస్, థర్మల్ కట్టర్లతో టీబీఎం పరికరాలను కట్ చేసి 1200 టన్నుల బరువైన ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, క్రేన్లు, క్యాబిన్లు, కంపార్ట్‌మెంట్లను బయటకు తీసుకొచ్చారు. టన్నెల్‌లో 253 మీటర్ల మేర 9 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగిస్తూనే గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ కోసం గాలించారు. టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్, ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్‌కుమార్ డెడ్‌బాడీలు తప్ప మిగతా ఆరుగురి ఆచూకీ దొరకలేదు.
కీలకంగా మన్నెవారిపల్లి ఔట్‌లెట్
44 కిలోమీటర్ల పొడవైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇన్‌లెట్‌వైపు 14 కిలోమీటర్ల మేర పనులు పూర్తికాగా.. మన్నెవారిపల్లి ఔట్‌లెట్ వైపు 22 కిలోమీటర్ల దూరం తవ్వారు. మరో 9 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇన్‌లెట్ వైపు ప్రమాదం జరగడంతో ఇటువైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఔట్‌లెట్ అయిన మన్నెవారిపల్లి వైపు రెండో టీబీఎంతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల టీబీఎం బేరింగ్‌ను తీసుకురాగా ప్రస్తుతం దాని ఫిట్టింగ్ పనులు జరుగుతున్నాయి.
ఇక్కడ నుంచి తవ్వకాలు మొదలు పెట్టి మిగిలిన పనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ 9 కిలోమీటర్ల పరిధిలో రెండు చోట్ల షియర్ జోన్లు ఉన్నట్లు సైంటిస్ట్‌లు గుర్తించారు. దీంతో జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ సంస్థల రిపోర్ట్‌ల ఆధారంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. షియర్ జోన్ వద్ద టీబీఎంతో కాకుండా కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌లో పనులు చేసేలా హైలెవల్‌లో చర్చలు జరుగుతున్నట్లు సమచారం.
డేంజర్ జోన్‌లో చివరి 43 మీటర్లు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ప్లేస్ నుంచి 43 మీటర్ల ఏరియా ప్రస్తుతం కీలకంగా మారింది. 253 మీటర్లలో శిథిలాలను తొలగించినప్పటికీ ఆరుగురి ఆచూకీ దొరకకపోవడంతో.. మిగలిన 43 మీటర్ల ప్రాంతంలోనే వారి డెడ్‌బాడీలు ఉండేఅవకాశం ఉంది. కానీ ఈ ప్లేస్‌లో రెస్క్యూ చేపట్టడం అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ ప్లేస్‌లో ఓ సిమెంట్ సెగ్మెంట్ ఇప్పటికే పూర్తిగా కూలిపోగా, మరో సెగ్మెంట్ కిందికి వంగిపోయింది. ఈ ప్రాంతంలో మరోసారి స్లైడింగ్ జరగకుండా దుంగలు పేర్చి స్టీల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. టన్నెల్ చివరి ప్రాంతం నుంచి గంటకు 10 వేల లీటర్ల నీటి ఊట వస్తుండడంతో.. ఇక్కడ ఏది కదిలించినా మళ్లీ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.
ఈ 43 మీటర్ల ప్రాంతంలో తవ్వకాలు జరిపే అవకాశాలు దాదాపుగా లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపాలా ? లేక ఇక్కడితో రెస్క్యూ నిలిపివేయాలా ? అన్న విషయంపై గురువారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక్కడి రాళ్లు, మట్టిని అధ్యయనం చేసిన జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ సంస్థలు ఇచ్చే రిపోర్టులపైనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ భవిష్యత్ ఆధారపడి ఉందని సమాచారం.