
- స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ లోతేటి
అమ్రాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని స్పెషల్ ఆఫీసర్ శివ శంకర్ లోతేటి అన్నారు. 46 వ రోజు టన్నెల్‌లో సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి రెస్క్యూ పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాద ప్రదేశంలో తప్ప ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు వేగవంతం అయ్యాయని నీటి ఊట తగ్గించేందుకు భారీ పంపులతో డీ వాటరింగ్ చేస్తున్నామని తెలిపారు.
ఐదు ఎస్కావేటర్ల సహాయంతో మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపుతున్నట్లు తెలిపారు. రైల్వే సిబ్బంది టీబీఎం శకలాలను కత్తిరించి వాటి శిథిలాలను లోకో ట్రెయిన్ ద్వారా బయటకు తరలిస్తున్నారన్నారు. మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ విస్తరణ నిర్వహిస్తూ, రెస్క్యూ సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, పరికరాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్మీ, జేపీ కంపెనీ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.